తెలంగాణ

telangana

ETV Bharat / state

జాతీయ ప్రవేశ పరీక్షలకు వేళాయె...!

వచ్చే విద్యాసంవత్సరానికి (2021-22) వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశానికి జాతీయ స్థాయిలో నిర్వహించే పలు ప్రవేశ పరీక్షల నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. మరోవైపు విద్యార్థులు సొంతూళ్లలో.. ఇళ్లలో కళాశాలలకు దూరంగా ఉండి చదువుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ఆ ప్రకటనల గురించి, దరఖాస్తులు నింపడంపై గతంలో మాదిరిగా విద్యాసంస్థల ప్రతినిధులు కూడా చెప్పే పరిస్థితి లేకపోవడంతో జాగరూకతతో లేకుంటే విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని నిపుణులు, అధ్యాపకులు హెచ్చరిస్తున్నారు.

exams
జాతీయ ప్రవేశ పరీక్షలకు వేళాయె...!

By

Published : Jan 2, 2021, 7:43 AM IST

జాతీయస్థాయిలో ప్రవేశ పరీక్షల నిర్వహణకు గానూ కేంద్రం 2020 డిసెంబరులోనే నోటిఫికేషన్ల జారీని ప్రారంభించింది. అందుకు అనుగుణంగా ఉన్నత విద్యామండళ్లు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, ఈసెట్‌, ఐసెట్‌ లాంటి వాటికి ప్రకటనలు జారీ చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల నుంచి ఒక్క జేఈఈ మెయిన్‌కే 1.50 లక్షల మంది దరఖాస్తు చేస్తారు. మిగిలిన వాటికి 5 వేల నుంచి 20 వేల మంది హాజరవుతారు.

ఇవి వచ్చాయ్‌..

  • ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి, ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సంపాదించేందుకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ విడులైంది. ఫిబ్రవరి 23 నుంచి 26 వరకు జరిగే పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు తుది గడువు జనవరి 16.
  • దేశవ్యాప్తంగా 22 జాతీయ లా వర్సిటీల్లో యూజీ, పీజీ న్యాయవిద్య అభ్యసించేందుకు కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు(క్లాట్‌) నిర్వహిస్తారు. దీనికి తాజాగా ప్రకటన జారీ అయింది. ఈనెల 1వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు. తుది గడువు మార్చి 31. పరీక్ష మే 9న నిర్వహిస్తారు.
  • ఫార్మా విద్యకు జాతీయస్థాయి విద్యాసంస్థలైన జాతీయ ఫార్మా విద్య, పరిశోధన సంస్థలు(నైపర్ల)లో ఎంఫార్మసీ, అందుకు సంబంధించిన ఇతర కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఫార్మసీ ఆప్టిట్యూడ్‌ టెస్టు(జీప్యాట్‌) ప్రకటన వారం కిందట జారీ అయింది. దేశవ్యాప్తంగా పలు బిజినెస్‌ స్కూళ్లలో ఎంబీఏ/పీజీడీఎం లాంటి కోర్సుల్లో చేరేందుకు కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టు(సీమ్యాట్‌) ప్రకటన కూడా వచ్చింది. ఈ రెండూ ఫిబ్రవరి 22, 27 తేదీల్లో ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ డిసెంబరు 23 నుంచి ప్రారంభం కాగా.. తుది గడువు జనవరి 22వ తేదీ.
  • దేశవ్యాప్తంగా ఉన్న 18 నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌)లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్‌ ఆఫ్‌ డిజైన్‌ కోర్సుల్లో సీట్ల భర్తీకి దరఖాస్తు గడువు ఈనెల 21వ తేదీ. పరీక్ష ఫిబ్రవరి 14న జరగనుంది. ఇంకా నీట్‌ తదితర ప్రకటనలు త్వరలో రానున్నాయి.
  • పలు డీమ్డ్‌, ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో బీటెక్‌ ప్రవేశాలకు కూడా పరీక్షల కోసం ప్రకటనలు జారీ అవుతున్నాయి. ఎస్‌ఆర్‌ఎం, విట్‌ తదితర వర్సిటీలు ఇప్పటికే విడుదల చేశాయి.

విద్యార్థులూ.. పారాహుషార్‌

  • గతంలో ఇంటర్‌ విద్యార్థులు అధిక శాతం కళాశాలల హాస్టళ్లలో ఉంటూ చదువుకునేవారు. కరోనాతో తెలంగాణలో కళాశాలలు తెరవలేదు. ఏపీలో తెరిచినా హాస్టల్‌ సౌకర్యం లేదు.
  • ఒకవేళ కళాశాలలు తమ విద్యార్థులకు దరఖాస్తు చేసినా తప్పులు దొర్లవచ్చు. దరఖాస్తుదారులు వివరాలను ఒకటికి రెండుసార్లు సరిచూసుకోవాలి.
  • చాలామంది ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ కోటా కిందికి వస్తామంటూ దరఖాస్తులు నింపుతున్నారు. తర్వాత ధ్రువపత్రాలు ఉండవు. ఫలితాల్లో ఆ కోటా కింద ర్యాంకు కేటాయిస్తారు కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి.

సంక్షిప్త సందేశాలు పంపిస్తున్నాం

జేఈఈ పరీక్షల శిక్షణ నిపుణుడు ఎం.ఉమాశంకర్‌ మాట్లాడుతూ తాము ఎప్పటికప్పుడు సంక్షిప్త సందేశాలు, వీడియోలు రూపొందించి విద్యార్థులకు పంపిస్తున్నామన్నారు. అధికశాతం మంది ఆయా ప్రకటనలకు సంబంధించి సమాచార పత్రాన్ని(బ్రోచర్‌)ను, ప్రశ్నలు-జవాబులు చదవకపోవడమే పెద్ద సమస్యగా మారిందన్నారు. వాటిని పూర్తిగా చదివి.. దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

ఇదీ చదవండి: టీకా ఉత్పత్తిలో హైదరాబాద్​ది కీలకపాత్ర: గవర్నర్​

ABOUT THE AUTHOR

...view details