తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్యారోగ్య శాఖలో 1,147 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల - తాజా ఉద్యోగ నియామక ప్రకటన

Medical Assistant Professors Recruitment in Telangana : నిరుద్యోగులకు రాష్ట్రప్రభుత్వం మరో గుడ్​న్యూస్ చెప్పింది. ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో 1,147 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ మేరకు మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్​మెంట్ బోర్డు ప్రకటన విడుదల చేసింది. వైద్యారోగ్యశాఖలో ఉద్యోగాల వర్షం కురుస్తోందని మంత్రి హరీశ్​రావు ట్వీట్ చేశారు.

Medical Assistant Professors Recruitment
Medical Assistant Professors Recruitment

By

Published : Dec 6, 2022, 7:44 PM IST

Updated : Dec 7, 2022, 6:24 AM IST

Medical Assistant Professors Recruitment in Telangana:ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో కొత్తగా 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రకటనను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) మంగళవారం వెలువరించింది. ఈ నెల 20న ఉదయం 10.30 గంటల నుంచి వచ్చే నెల 5న సాయంత్రం 5 గంటల వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొంది. ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన వర్తిస్తుందని వెల్లడించింది.

ప్రైవేటు ప్రాక్టీసు అంశంలో స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ప్రభుత్వ వైద్యంలో సేవలందించాలనే ఆసక్తి ఉన్నవారే దరఖాస్తు చేసుకుంటారని, అలాంటి వారు పోస్టింగ్‌ ఎక్కడ ఇచ్చినా పనిచేస్తారని వైద్యవర్గాలు భావిస్తున్నాయి. ఈ పోస్టుల భర్తీలోనూ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నా, గతంలో పనిచేసినా..ఆ అనుభవానికి మార్కులుంటాయి. రానున్న మూడు నెలల్లోపు ఈ నియామక ప్రక్రియను పూర్తిచేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి. ఎంపికైన అర్హుల జాబితాను ఆన్‌లైన్‌లో వెల్లడిస్తామని తెలిపాయి.

  • అర్హత మార్కులకు 80 పాయింట్లు

* స్పెషలిస్ట్‌ వైద్యులకు..పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌/సూపర్‌ స్పెషాలిటీ పరీక్షలో పొందిన మార్కుల శాతం ఆధారంగా గరిష్టంగా 80 పాయింట్లు నిర్ధారిస్తారు.

* మార్కులు ఇవ్వని విశ్వవిద్యాలయాల్లో చదివిన అభ్యర్థులకు గ్రేడ్లు, మార్కుల మధ్య సమానత్వ సూత్రాన్ని పాటిస్తారు. గ్రేడ్‌ ‘ఎ’లో 60 శాతం మార్కులను ఎక్స్‌లెన్స్‌గా, ‘బి’గ్రేడ్‌లో 55 శాతాన్ని ‘గుడ్‌’గా నిర్ణయించారు.

* 50 శాతం వస్తే పాస్‌ గ్రేడ్‌గా నిర్ధారిస్తారు.

* మిగిలిన 20 పాయింట్లను ప్రభుత్వ వైద్యంలో సహాయ ఆచార్యులుగా ఒప్పంద, పొరుగు సేవల్లో పనిచేసిన వారికి వెయిటేజీగా కేటాయిస్తారు.

* ఈ కేటగిరీ అభ్యర్థులు ఒప్పంద, పొరుగు సేవల అనుభవ ధ్రువపత్రం కోసం సంబంధిత ఉన్నతాధికారికి దరఖాస్తు చేయాలి. 15 రోజులలోపు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేయాలి లేదా తిరస్కరించాలి.

* అభ్యర్థులు సంబంధిత అధికారులు జారీచేసిన ధ్రువపత్రాన్ని, ఇతర సర్టిఫికెట్లను ఆన్‌లైన్‌ దరఖాస్తుకు జతచేయాలి.

* అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకున్న నిర్దేశిత కేటగిరీలో అందుబాటులో ఉన్న అన్ని పోస్ట్‌లకూ వారి ప్రాధాన్యాలను ప్రస్తావించాలి. పొందిన పాయింట్లు, ప్రాధాన్యత ఆధారంగా పోస్టులను కేటాయిస్తారు.

ఆరు నెలలకు 2.5 పాయింట్లు:గిరిజన ప్రాంతాల్లో అందించిన సేవలకు అధికంగా వెయిటేజీ మార్కులు కేటాయిస్తారు. అక్కడ 6 నెలల పనికాలానికి 2.5 పాయింట్ల చొప్పున, గిరిజనేతర ప్రాంతాల్లో అందించిన సేవలకు 6 నెలలకు 2 పాయింట్ల చొప్పున ఇస్తారు. 6 నెలల సర్వీసు పూర్తయిన వారిని మాత్రమే వెయిటేజీకి అర్హులుగా పరిగణిస్తారు. ఒప్పంద, పొరుగు సేవలకు సంబంధించిన పాయింట్లు దరఖాస్తు చేసిన పోస్ట్‌ కేటగిరీలోని సర్వీస్‌కు మాత్రమే అందిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థి జనరల్‌ మెడిసిన్‌ విభాగంలో సహాయ ఆచార్యుడి పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న పక్షంలో.. గతంలో ప్రభుత్వ వైద్యంలో సంబంధిత స్పెషాలిటీ విభాగంలో ఏ ప్రాంతంలో పనిచేశారనే ప్రాతిపదికన పాయింట్లు కేటాయిస్తారు. సీనియర్‌ రెసిడెంట్లకు కూడా పాయింట్లు కేటాయిస్తారు.

అనుభవానికి ఆధారాలుండాల్సిందే: కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అనుభవ ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేస్తున్నప్పుడు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌, హాజరు పట్టీలకు సంబంధిత దస్త్రాలను సూచించాలి. వాటి కాపీలనూ జత చేయాలి. నిర్దేశిత రూపంలో సంబంధిత ఆసుపత్రుల బాధ్యుల నుంచి అనుభవ ధ్రువీకరణను పొందాలి.

గరిష్ఠ వయోపరిమితి 44 ఏళ్లు:గరిష్ఠ వయసు 44 ఏళ్లు. టీఎస్‌ఆర్‌టీసీ, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నవారికి, ఎస్సీ ఎస్టీ బీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్‌ సర్వీస్‌మన్‌, ఎన్‌సీసీ అభ్యర్థులకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

* పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ అర్హతలను స్పెషాలిటీ పోస్టులకు అర్హతగా పరిగణిస్తారు.

* దరఖాస్తు చేసుకోబోయే అభ్యర్థులందరూ తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వైద్య మండలిలో తమ అర్హత ధ్రువపత్రాలను నమోదు చేసుకోవాలి.

ఇవీ చదవండి:

Last Updated : Dec 7, 2022, 6:24 AM IST

ABOUT THE AUTHOR

...view details