Medical Assistant Professors Recruitment in Telangana : ప్రభుత్వ బోధనాసుపత్రులు, వైద్య కళాశాలల్లో కొత్తగా 1,147 సహాయ ఆచార్యుల పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది. సంబంధిత ప్రకటనను వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ(ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) వారం రోజుల్లో వెలువరించనున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ద్వారా 969 సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామకాలను చేపడుతున్నారు. వీటి పరంగా దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ పూర్తయింది. అర్హుల ఎంపిక జాబితానూ విడుదల చేశారు. మంగళవారం(22) నుంచి ధ్రువపత్రాల పరిశీలన మొదలై ఈనెల 25తో పూర్తవుతుంది. అనంతరం మరో వారంలోగా ప్రక్రియ కొలిక్కి రానున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.
సివిల్ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకోగానే.. సహాయ ఆచార్యుల నియామక ప్రకటనను వెలువరించే యోచనలో ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ ఉంది. ఆ ప్రకటనలోనూ ప్రైవేటు ప్రాక్టీసుపై నిషేధం నిబంధన కొనసాగుతుంది. సివిల్ అసిస్టెంట్ సర్జన్ నియామకాల్లో అయితే ప్రైవేటు ప్రాక్టీసు నిషేధం నిబంధన అమల్లో ఉన్నా.. సుమారు 4800 మంది దరఖాస్తు చేశారు. ఈ పోస్టులన్నీ ఎంబీబీఎస్ అర్హతతో కూడినవే కావడంతో ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సహాయ ఆచార్యుల పోస్టులన్నీ కూడా స్పెషలిస్టు, సూపర్ స్పెషలిస్టు ఉద్యోగాలు. వీటికీ ప్రైవేటు ప్రాక్టీసు నిషేధాన్ని వర్తింపజేస్తే దరఖాస్తుదారులకు ముందుగానే స్పష్టత ఇచ్చినట్లవుతుందని.. ఈ క్రమంలో ఔత్సాహికులే ముందుకొస్తారని, అప్పుడు ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా పని చేస్తారని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.
ఈ పోస్టుల భర్తీలోనూ అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అంటే ఇప్పటికే ప్రభుత్వ వైద్యంలో ఒప్పంద, పొరుగు సేవల ప్రాతిపదికన సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నా, గతంలో పనిచేసినా, ఆ అనుభవానికి కూడా మార్కులుంటాయి. పీజీ వైద్యవిద్య పూర్తి చేసి, ఒక సంవత్సరం సీనియర్ రెసిడెంట్‌గా పనిచేసినవారు ఈ పోస్టులకు అర్హులు. వచ్చే మూడు నెలల్లోగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేస్తామని వైద్యవర్గాలు తెలిపాయి.