తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యేలకు ఎర కేసు.. బీజేపీ నేత బీఎల్‌ సంతోష్‌కు నోటీసులు - trs MLAs poaching case latest news

ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత బి.ఎల్‌.సంతోశ్​కు నోటీసులు
ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత బి.ఎల్‌.సంతోశ్​కు నోటీసులు

By

Published : Nov 18, 2022, 9:30 PM IST

Updated : Nov 19, 2022, 7:22 AM IST

21:26 November 18

ఎమ్మెల్యేలకు ఎర కేసులో భాజపా నేత బి.ఎల్‌.సంతోశ్​కు నోటీసులు

MLAs Poaching Case Updates: ఎమ్మెల్యేలకు ఎర’ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంటోంది. భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బొమ్మెరబెట్టు లక్ష్మీ జనార్దన సంతోష్‌కు సిట్‌ తాజాగా 41ఏ సీఆర్పీసీ నోటీసు జారీ చేసింది. ఈ నెల 21న హైదరాబాద్‌లోని పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొంది. రాకపోతే అరెస్టు చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. బీఎల్‌ సంతోష్‌ స్వస్థలం కర్ణాటకలోని ఉడుపి కాగా.. బెంగళూరులోని మల్లేశ్వరం, టెంపుల్‌ స్ట్రీట్‌ చిరునామాతో నోటీసు జారీ అయింది.

గత నెల 26న మొయినాబాద్‌ ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలతో సమావేశమైన నిందితుడు రామచంద్రభారతి పలువురు ముఖ్యనేతల పేర్లను ఉటంకించారు. నంబర్‌ 1, నంబర్‌ 2 అంటూ సంబోధించడంతోపాటు భాజపా అగ్రనేతలు బీఎల్‌ సంతోష్‌, సునీల్‌కుమార్‌ బన్సల్‌, కేరళ నేత తుషార్‌ పేర్లను పేర్కొన్నాడు. తుషార్‌కు ఇప్పటికే నోటీసు జారీ చేసిన సిట్‌.. బీఎల్‌ సంతోష్‌కూ తాఖీదు పంపింది. విచారణకు వచ్చేటప్పుడు 9449831415 నంబరు సిమ్‌తోపాటు ఐఎంఈఐ నంబరు 353846108969790తో కూడిన సెల్‌ఫోన్‌ను వెంట తీసుకురావాలని సూచించింది. బన్సల్‌కు నోటీసు ఇచ్చారా? లేదా? అనే అంశంపై స్పష్టత రాలేదు.

‘సంతోష్‌ కీలకం’ అని పేర్కొన్న భారతి

ఫామ్‌హౌస్‌ ఎపిసోడ్‌లో సంతోష్‌ను ఆరెస్సెస్‌లో కీలకనేతగా రామచంద్రభారతి ఉటంకించాడు. ‘సంతోష్‌ చాలా కీలకం. నంబర్‌1, 2లే ఆయన ఇంటికి వస్తుంటారు. ఆయన వారి దగ్గరకు వెళ్లరు. అది మా సంస్థలో ప్రోటోకాల్‌. మంత్రులు కూడా అపాయింట్‌మెంట్‌ తీసుకుని ఆయనను కలవాలి. పెద్దసంఖ్యలో ఎమ్మెల్యేలు ఉంటే తప్ప ఆయనకు కాల్‌ చేసి రమ్మనడం సాధ్యం కాదు. పేమెంట్‌తో ఎలాంటి సమస్య లేదు’ అని రామచంద్రభారతి చేసిన వ్యాఖ్యలు రహస్య కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ ఫోన్‌ నుంచి ‘సంతోష్‌ బీజేపీ’ పేరిట ఉన్న కాంటాక్టుకు ఇంగ్లిషులో పంపిన మెసేజ్‌లను గుర్తించారు. ‘నేను రామచంద్ర స్వామీజీని. హరిద్వార్‌ బైఠక్‌లో మిమ్మల్ని కలిశాను. తెలంగాణలో కీలకాంశాల గురించి చర్చించాలి. 25 మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. నా పరిధిలో మొత్తం 40 మంది నేను చెప్పేది వింటారు. ఇదివరకు చెప్పినట్లుగా పైలట్‌ రోహిత్‌రెడ్డి (లీడర్‌), హర్షవర్ధన్‌రెడ్డి, గువ్వల బాలరాజు, రేగా కాంతారావు పార్టీ మారతామంటున్నారు. మీ అపాయింట్‌మెంట్‌ కావాలి. అంతకంటే ముందు ఆ ముగ్గురికీ కొంత విటమిన్‌ అవసరం’ అనే మెసేజ్‌లున్నాయి. సంతోష్‌ నుంచి భారతికి తిరుగు సమాధానాలు వచ్చినట్లు కనిపించలేదు. ఈ అంశాలపైనే ప్రస్తుతం సిట్‌ విచారించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దొరకని జగ్గు స్వామి.. నోటీసు జారీ

కేసులో కీలకంగా భావిస్తున్న కేరళ వైద్యుడు జగ్గుస్వామి కోసం అయిదు రోజులుగా నిర్వహించిన సిట్‌ వేట ఫలించకపోవడంతో అతడికీ నోటీసులు జారీ చేశారు. సిట్‌ సభ్యురాలు, నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి నేతృత్వంలోని బృందం కొచ్చి, కొల్లాంల్లో గాలించినా అతడు దొరకలేదు. దీంతో కొచ్చిలో అతడు పనిచేసే ఆసుపత్రిలో నోటీసులు ఇచ్చారు. ఈ నెల 21న హైదరాబాద్‌లో విచారణకు హాజరు కావాలని సూచించారు.

ఇవీ చదవండి:

Last Updated : Nov 19, 2022, 7:22 AM IST

ABOUT THE AUTHOR

...view details