Police notices to Etala Rajender: పదో తరగతి ప్రశ్నపత్రాల కేసులో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేటలోని ఆయన నివాసానికి వెళ్లి.. తాఖీదులు అందించారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు వరంగల్ డీసీపీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని పేర్కొన్నారు. 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు అందించారు. ఈటల రాజేందర్ పీఏలు రాజు, నరేంద్రలకు ఈ నోటీసులను అందించినట్లు పోలీసులు తెలిపారు.
పోలీసులు నోటీసులపై ఈటల రాజేందర్ స్పందించారు. విచారణకు రావాలని పోలీసులు నుంచి నోటీసులు అందాయని పేర్కొన్నారు. మొదట తమ న్యాయవాదులతో మాట్లాడి తదుపరి నిర్ణయం తీసుకుంటానని చెప్పుకొచ్చారు. ఈనెల 10న విచారణకు హాజరవుతానని తెలిపారు. పోలీసులకు వాంగ్మూలం ఇచ్చేందుకు హన్మకొండ డీసీపీ ఆఫీసుకు వెళ్తానని ఈటల వెల్లడించారు.
10th class question paper case updated: హిందీ ప్రశ్నపత్రం లీకేజీకి ముందు రోజే నిందితుడు ప్రశాంత్‌తో కలిసి కుట్ర చేసినట్లు ఆధారాలు లభించడంతోనే ఎంపీ బండి సంజయ్‌ను అరెస్టు చేసినట్లు వరంగల్ కమిషనర్ ఎ.వి.రంగనాథ్ బుధవారం మీడియా సమావేశంలో చెప్పారు. ప్రశాంత్ ప్రశ్నపత్రాన్ని బండి సంజయ్‌తోపాటు ఈటల రాజేందర్‌కు, ఆయన పీఏలకు కూడా పంపినట్లు ఆయన వివరించారు. అనేక మంది బీజేపీ నాయకులకూ లీకేజీ సమాచారం వెళ్లినట్లు తెలిపారు.