తెలంగాణ

telangana

ETV Bharat / state

బిందు సేద్యానికి గ్రహణం.. పెరిగిన పరికరాల ధరలతో పంపిణీ నిలిపివేత - No Subisdy Drip Irrigation Equipment

Drip Irrigation Equipment: బిందు సేద్యానికి గ్రహణం పట్టింది. ధరలు పెరిగాయని తుంపర సేద్యానికి అవసరైమన పరికరాలను.. కంపెనీలు రైతులకు ఇవ్వడంలేదు. కంపెనీలు పెంచిన రేట్లను ప్రభుత్వం కూడా సమర్థించింది. పాత ధరల ప్రకారం రాయితీలివ్వడానికి ప్రభుత్వం ఉద్యానశాఖకు నిధులు విడుదల చేయడం లేదు. రాయితీ నిధులు లేకపోవడంతో రైతులు సొంతంగా ఖర్చులు భరిస్తున్నారు.

Drip Irrigation Equipment
బిందు సేద్యానికి గ్రహణం

By

Published : Jan 8, 2022, 9:01 AM IST

Drip Irrigation Equipment: సాగునీటి పొదుపు కోసం ప్రవేశపెట్టిన బిందు, తుంపర సేద్యానికి గ్రహణం పట్టింది. రాష్ట్రంలో ఈ పథకం అమలు దాదాపుగా నిలిచిపోయింది. ప్రభుత్వం మంజూరు చేసినా ధరలు పెరిగాయంటూ కంపెనీలు రైతులకు పరికరాలు ఇవ్వడం లేదు. చేలో ప్రతి మొక్కకు చుక్కచుక్కగా నీరు అందేలా గొట్టాలను ఏర్పాటుచేయడం బిందుసేద్య విధానం. వర్షం మాదిరి పడేలా తుంపర్ల పరికరాలను అమర్చడం మరో పద్ధతి. ఈ రెండింటిలో ఏది ఏర్పాటు చేయాలన్నా పీవీసీ గొట్టాలు, వాటికి నాజిల్స్‌, వాటి నియంత్రణ పరికరాలు అవసరం. వాటి ధరలను ఐదేళ్ల క్రితం ఉద్యానశాఖ నిర్ణయించింది. ఉదాహరణకు 20 అడుగుల పొడవుండే ప్లాస్టిక్‌ గొట్టం ధరను రూ.369గా అప్పట్లో నిర్ణయించింది. కానీ ఇటీవలికాలంలో కంపెనీలు దాన్ని రూ.500 నుంచి 600 దాకా పెంచాయి. ప్రభుత్వం కూడా అంతే చెల్లించాలని లేకపోతే ఇవ్వలేమని నిరాకరించాయి. మరోవైపు పాత ధరల ప్రకారం రాయితీలివ్వడానికి కూడా ప్రభుత్వం ఉద్యానశాఖకు నిధులు విడుదల చేయడం లేదు. ఉదాహరణకు వికారాబాద్‌ జిల్లాలో గత ఏప్రిల్‌ నుంచి ఇప్పటివరకూ మొత్తం 2,531 ఎకరాల్లో ఈ పరికరాలను ఉద్యానశాఖ మంజూరు చేస్తే కేవలం 110 ఎకరాల్లో అదీ సొంతంగా డబ్బు చెల్లించినవారి పొలాల్లోనే కంపెనీలు వాటిని పెట్టాయి. మిగతా రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. దాదాపుగా రాష్ట్రమంతా ఇలాంటి పరిస్థితే ఉందని ఉద్యానశాఖ సీనియర్‌ అధికారి తెలిపారు.

ఆయిల్‌పాంకు మాత్రమే పెంపు

ఆయిల్‌పాం పంట సాగు విస్తీర్ణాన్ని 30 లక్షల ఎకరాలు అదనంగా పెంచాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆ పంటకు మాత్రం బిందు, తుంపర పరికరాలకు ఎక్కువ ధర చెల్లించడానికి నిర్ణయించింది. కేంద్రం అమలుచేస్తున్న ‘ప్రధానమంత్రి కృషి సించాయి యోజన’ (పీఎంకేఎస్‌వై) కింద ఆయిల్‌పాం పంటకు హెక్టారు విస్తీర్ణంలో బిందు పరికరాలు పెట్టడానికి వ్యయం రూ. 27,304 ఉండగా ప్రస్తుతం ధరలు పెరిగినందున రాష్ట్ర ప్రభుత్వం రూ. 53,465కి పెంచింది. ఇందులో రూ. 9,010 మాత్రమే కేంద్రం ఇస్తోందని, దానిని పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. దీనికి ఇంతవరకూ బదులులేదు. మొత్తానికి ఆయిల్‌పాం పంటకు మాత్రమే పెంచిన ధర ప్రకారం రాష్ట్ర ఉద్యానశాఖ బిందు సేద్యం పరికరాలు మంజూరు చేస్తోంది. మిగతా పంటలకు మంజూరు లేదని కంపెనీలు కూడా ఇవ్వడం లేదు. ఎవరైనా రైతులు ఆసక్తి చూపితే వారు అదనపు సొమ్మును సొంతంగా భరిస్తామంటేనే కంపెనీలు పరికరాలను ఇస్తున్నాయి.

‘పాత’ మెలిక..

పీఎంకేఎస్‌వై కింద ఒక రైతుకు ఒకసారి బిందు లేదా తుంపర పరికరాలిస్తే వారికి మళ్లీ ఏడేళ్ల వరకూ రాయితీ ఇవ్వకూడదనేది కేంద్ర నిబంధన. ఇతర పంటల నుంచి రైతులను ఆయిల్‌పాం వైపు మళ్లించాలంటే ఇది ఆటంకంగా మారుతోంది. గతంలో ఇతర పంటలకు వారు రాయితీ పొందినందున ఇప్పుడు ఆయిల్‌పాంకు ఇవ్వడంలేదు. ఈ నిబంధన కూడా సడలించాలని రాష్ట్ర వ్యవసాయమంత్రి కేంద్రాన్ని కోరారు. బిందు, తుంపర సేద్యం వల్ల సాగునీటిని పొదుపుగా వాడుతూ అధిక దిగుబడి సాధించవచ్చని జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధనా సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌ చెప్పారు. ఎరువులను కూడా బిందుసేద్యం గొట్టాల ద్వారా ఇవ్వడం వల్ల సాగు ఖర్చు తగ్గుతుందని తెలిపారు.

ఇదీ చూడండి:Nutrition‌ Garden: సత్ఫలితాలిస్తోన్నా... అంగన్వాడీల్లో కనిపించన న్యూట్రిషన్​ గార్డెన్లు..!

ABOUT THE AUTHOR

...view details