హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ శస్త్ర చికిత్సలు ప్రారంభమయ్యాయి. శస్త్ర చికిత్స చేయించుకునే వారికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేసి వైరస్ సోకలేదని నిర్ధరించుకున్న తర్వాతే శస్త్ర చికిత్స చేయనున్నారు. శ్వాసకోశ, గొంతు, ఊపిరితిత్తులు లాంటి శస్త్ర చికిత్సలకు కొవిడ్-19 టెస్టు తప్పనిసరి చేశారు.
సాధారణ శస్త్ర చికిత్సలు షురూ! - surgeries started in Hyderabad hospitals
భాగ్యనగరంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో సాధారణ శస్త్ర చికిత్సలు ప్రారంభమయ్యాయి. కరోనా అనుమానిత లక్షణాలు ఉన్న రోగులకు ముందే పరీక్షలు చేసి... ఆ మహమ్మారి లేదని తేలితేనే చికిత్స చేయనున్నారు.
ఈ పరీక్షలు ప్రైవేటు ల్యాబ్‌ల్లో చేసేందుకు ఇంకా అనుమతులు రాకపోవడంతో...శాంపిళ్లు తీసి గాంధీ, నిమ్స్, సీసీఎంబీ తదితర ల్యాబ్‌లకు పంపుతున్నారు. న్యూరో, గుండె ఇతర అత్యవసర శస్త్ర చికిత్సలు విషయంలో మాత్రం అన్ని జాగ్రత్తలు తీసుకొని తొలుత శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. తర్వాత అవసరం అనుకుంటే కరోనా పరీక్షలకు వెళుతున్నారు.
నిమ్స్, ఉస్మానియాకు ఓపీ తాకిడి
కొన్ని రోజులుగా ఉస్మానియాతోపాటు నిమ్స్‌కు బయటి రోగులు(ఓపీ) పెరిగారు. ప్రస్తుతం ఉస్మానియాకు నిత్యం 1100 మంది వరకు వస్తున్నారు. నిమ్స్‌లోనూ దాదాపు ఇదే పరిస్థితి. భౌతిక దూరం తప్పనిసరి చేసి, ప్రతి రోగికి తొలుత థర్మో స్క్రీనింగ్ చేస్తున్నారు. దీంతో సేవలు పొందడంలో కొంత జాప్యం చోటుచేసుకుంటోంది. నిమ్స్‌లో ఇప్పటికే ఇతర సాధారణ సర్జరీలు ప్రారంభించారు. ఉస్మానియాలో సాధారణ శస్త్ర చికిత్సలకు వచ్చే ప్రతి ఒక్కరికి ఛాతి(చెస్ట్) ఎక్సరే తప్పనిసరి చేశారు. అనుమానిత లక్షణాలు కన్పిస్తే...శస్త్ర చికిత్సలు చేసే ముందు కరోనా పరీక్షలు చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్ తెలిపారు.