తెలంగాణలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లు సీఎం కేసీఆర్ ప్రకటన చేసినట్లు... 20 రోజుల్లోనే ప్రారంభించేందుకు యంత్రాంగం సిద్దమవుతోంది. గత నెల 29న ముఖ్యమంత్రి వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించారు. కానీ ఈనెల 2 నుంచి వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. కేసీఆర్ ప్రకటనకు అనుగుణంగా ఈనెల 23న వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రారంభించేందుకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేతృత్వంలో అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
సమస్యలు పరిష్కరించేందుకు
తరచూ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నప్పటికీ... ఎప్పటికప్పుడు వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఈనెల 18న నమూనా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మొదలయ్యే అవకాశం ఉంది. ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పరిధిలో 10 నుంచి 20 నమూనా రిజిస్ట్రేషన్లను చేయనున్నారు. ఈ సందర్భంగా తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఆయా సబ్ రిజిస్ట్రార్‌కు అవకాశం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు. అలా రెండు, మూడు రోజులు చేయడం ద్వారా తప్పులు, పొరపాట్లను సవరించుకుని... చిన్నపాటి తప్పు కూడా జరగకుండా రిజిస్ట్రేషన్లు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని... అధికారులు అభిప్రాయపడుతున్నారు.
రోజుకు 70 నుంచి 80
సాధారణంగా కార్డ్ ద్వారా ఇప్పటి వరకు ఒక రిజిస్ట్రేషన్ పూర్తి కావాలంటే... క్రయ విక్రయదారులు తీసుకొచ్చే డాక్యుమెంట్ల అన్నీ సక్రమంగా ఉంటే... వాటిని పరిశీలన చేస్తారు. ఆ తరువాత సంబంధిత సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్‌ను చదివి వారికి వినిపిస్తారు. విక్రయదారులు, కొనుగోలుదారుల ఇద్దరి అంగీకారంతో రిజిస్ట్రేషన్ తదుపరి ప్రక్రియ కొనసాగుతుంది. ఆధార్ కార్డుల పరిశీలన, వేలిముద్రలు, ఫోటోలు తీసుకోవడం, డాక్యుమెంట్లకు సంబంధించి డేటా ఎంట్రీ చేయడం లాంటివి చేయాల్సి ఉండేది. ఇలా ఒక్కో రిజిస్ట్రేషన్‌కు 20 నిముషాలకు తక్కువ లేకుండా సమయం పట్టేది. అంటే రోజుకు 30 నుంచి 40 రిజిస్ట్రేషన్లు ఒక్కో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగేవి.
రాత్రి వరకు
ఇక రద్దీ అధికంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ... వంద కూడా జరిగేవి. కానీ వాటికి చెందిన వివరాలు కంప్యూటర్‌లో ఎంటర్ చేయడం, ఇతరత్తర ప్రక్రియ సకాలంలో పూర్తి చేసేందుకు... రాత్రి వరకు పని చేయాల్సి ఉండేది. రిజిస్ట్రేషన్ జరిగిన తరువాత... కొనుగోలుదారుడు ఆస్తి తన పేరున నమోదు కావడానికి మున్సిపల్, పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.