తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎవరికీ దక్కని ఆధిక్యం.. అతిపెద్ద పార్టీగా తెరాస - hyderabad latest news

ఉద్వేగభరిత ఉపన్యాసాలు, సవాళ్లు- ప్రతి సవాళ్లు, జాతీయ స్థాయి నేతల ప్రచారంతో దేశం దృష్టిని ఆకర్షించిన హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఎవరికీ స్పష్టమైన ఆధిక్యాన్నివ్వలేదు. అధికార తెరాసను మేయర్ పీఠానికి కాస్తంత దూరంలో నిలబెట్టారు. ఈ ఎన్నికల్లో కారు వేగాన్ని కమలం నిలువరించింది.

ghmc results
ఎవరికీ దక్కని ఆధిక్యం.. అతిపెద్ద పార్టీగా తెరాస

By

Published : Dec 5, 2020, 5:03 AM IST

150 డివిజన్లు ఉన్న బల్దియాలో అధికార తెరాస 55 స్థానాలు పొంది అతి పెద్ద పార్టీగా ఆవిర్భవించింది. అనూహ్యంగా పుంజుకున్న భారతీయ జనతా పార్టీ 48 స్థానాల్లో విజయం సాధించింది. సీట్లు, ఓట్లలోనూ తెరాసతో పోటీపడింది. తెరాసకు 35.81 శాతం ఓట్లు రాగా, భాజపా 35.56 శాతం ఓట్లు సాధించింది. ఈ రెండు పార్టీలకు పోలైన ఓట్ల శాతంలో తేడా 0.25 శాతం మాత్రమే.

ఎంఐఎం 18.76 శాతం ఓట్లతో 44 స్థానాలను గెల్చుకుంది. కాంగ్రెస్ కేవలం రెండు స్థానాలకే పరిమితమైంది. స్వస్తిక్ గుర్తు వివాదం కారణంగా నేరేడ్​మెట్​లో ఫలితాన్ని నిలిపివేశారు. తెలుగుదేశం పార్టీతో పాటు వామపక్షాల అభ్యర్థులకు చాలా వరకు డిపాజిట్లు దక్కలేదు.

పోస్టల్ బ్యాలెట్లలో భాజపాకు ఎక్కువ ఓట్లు..

ఫలితాల సరళిని పరిశీలిస్తే మొదటి నుంచి తెరాస-భాజపా నువ్వా-నేనా అన్నట్లుగా పోటీ సాగింది. కాస్త అటూ ఇటుగా తెరాసతో సమానంగా అనేక స్థానాల్లో భాజపా ఆధిక్యాన్ని కనబర్చింది. ఓట్ల లెక్కింపు మొదలైన మొదటి రెండు గంటల్లో తెరాస అభ్యర్థులు అనేక స్థానాల్లో మెజార్టీలోకి వచ్చారు. చాలాచోట్ల రెండో రౌండ్ తరువాత భాజపా మెజార్టీ దిశగా కొనసాగింది. పోస్టల్ బ్యాలెట్లలో భాజపాకు ఎక్కువ ఓట్లు వచ్చాయి.

పొత్తులు లేకుండా బరిలోకి..

గ్రేటర్ బరిలో దిగిన అన్ని ప్రధాన పార్టీలు ఎలాంటి పొత్తులు లేకుండా విడివిడిగా పోటీ చేయడం ఈసారి ఎన్నికల ప్రత్యేకం. తెరాస 150 స్థానాల్లో అభ్యర్థులను నిలపగా, భాజపా 149, కాంగ్రెస్ 146, ఎంఐఎం 51, తెదేపా 106 స్థానాల్లో పోటీచేశాయి. వామపక్షాలు 60 డివిజన్లలో పోటీ చేశాయి. గత బల్దియా ఎన్నికల్లో 99 స్థానాలు పొందిన తెరాస ఈసారి 55 స్థానాలకు పరిమితమైంది.

అప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని గెలిచిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఒంటరిగా పోటీచేసి 48 స్థానాలను దక్కించుకుంది. ఎంఐఎం గతంలో లాగే ఈసారి 44 డివిజన్లను గెలుచుకుని పట్టు నిలబెట్టుకుంది. కాంగ్రెస్ ఈసారి రెండు స్థానాలకు పరిమితమైంది. అయితే గత ఎన్నికల్లో గెలిచిన డివిజన్లలో ఓడిపోగా కొత్తగా రెండుచోట్ల గెలవడం గమనార్హం.

తెరాసను ఆదుకున్న 3 నియోజకవర్గాలు

శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో 37 స్థానాలుండగా వాటిలో 32 స్థానాలు తెరాసకు లభించాయి. ప్రధానంగా శేరిలింగంపల్లి, కూకట్​పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 26 డివిజన్లలో 23 స్థానాలు తెరాసకు దక్కాయి. అదే సమయంలో మొత్తం పన్నెండు నియోజవర్గాల్లో తెరాస ఒక్క డివిజన్ కూడా గెలవలేకపోయింది. గత ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 డివిజన్లు గెలుచుకున్న తెరాస.. ఈసారి ఒక్క డివిజన్ కూడా గెల్చుకోలేకపోవడం ఆ పార్టీకి స్థానాలు తగ్గడానికి కారణమైందని నిపుణులు చెబుతున్నారు.

లెక్కింపులో అభ్యంతరాలు, ఆందోళనలు

  • ఎల్బీనగర్ జోన్​లో బీఎన్ రెడ్డినగర్​లో రీకౌంటింగ్ చేయాలని తెరాస పట్టుబట్టింది. ఫలితాల్లో తెరాస అభ్యర్థిపై భాజపా అభ్యర్థి కేవలం 32 ఓట్ల తేడాతో గెలిచారు. తెరాస అభ్యర్థి ప్రసన్నలక్ష్మి రీకౌంటింగ్ చేయాలని రారు.
  • బంజారాహిల్స్ ముఖరంజా కాలేజీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రంలో ఓట్లు గల్లంతవుతున్నాయంటూ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. 91, 92, 93, 94, 95 డివిజన్లలో లెక్కింపు జరుగుతుండగా వెంకటేశ్వర కాలనీ డివిజన్​ తెరాస, భాజపా ఏజెంట్లు వాగ్వాదానికి దిగారు.
  • వివేకానందనగర్‌లో డివిజన్​లో పోలైన ఓట్ల కంటే బ్యాలెట్ బాక్సులో ఓట్లు ఎక్కువున్నాయని ఏజెంట్ ఆరోపించారు. బాక్సుకు సీలు సక్రమంగా లేదంటూ బయటకు వెళ్లిపోయారు.
  • మౌలాలి డివిజన్‌లో ఉదయం లెక్కింపును నిలిపివేశారు. ఓ బాక్సులో పోలైన ఓట్లకంటే ఎక్కువ పత్రాలున్నాయంటూ ఆపేసి.. అధికారుల ఆదేశాలతో మళ్లీ కొనసాగించారు.

ఇవీచూడండి:బల్దియా ఫలితాలు: తెరాస-55, భాజపా-48, మజ్లిస్​-44, కాంగ్రెస్​-2

ABOUT THE AUTHOR

...view details