తుంగభద్ర పుష్కరాల గడువు సమీపిస్తున్నా సౌకర్యాల కల్పనలో కదలికలు కనిపించడం లేదు. స్నానఘాట్ల నిర్మాణం, ఇతరత్రా పనులు చేపట్టేందుకు సమయం సమీపిస్తోంది. నవంబరు 20 నుంచి 12 రోజులపాటు పుష్కరాలు జరగనున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ కర్నూలు ఇంఛార్జ్ మంత్రి, జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈనెల 17న సమావేశం నిర్వహించారు. చేపట్టాల్సిన పుష్కర పనులపై ప్రాధాన్యాల వారీగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
జలవనరులశాఖ అధికారులు వివిధ ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ ప్రభుత్వపరంగా నిర్ణయం వెలువడలేదు. సౌకర్యాల కల్పనలో భాగంగా వివిధ పనులకు టెండర్లు పిలవాలి. వాటిని ఖరారు చేసి నిర్మాణాలను పూర్తి చేయాలంటే ఉన్న గడువు ఎలా సరిపోతుందనే ప్రశ్న వినిపిస్తోంది. లోగడ గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో పనులను జలవనరులశాఖ ఆలస్యంగా చేపట్టడం, కొన్ని చోట్ల నామినేషన్లపై పనులు అప్పగించడం వంటి అంశాలు వివాదాస్పదమయ్యాయి. పైగా వాటి పనుల్లో నాణ్యత లేదంటూ విజిలెన్సు నివేదికలు సమర్పించింది. దీంతో కొన్ని చోట్ల చీఫ్ ఇంజినీరు స్థాయి నుంచి, సూపరింటెండెంటు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల వరకు విజిలెన్సు కేసులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంది. రాష్ట్రంలో దాదాపు 220 కి.మీ.పొడవునా కర్నూలు జిల్లాలో తుంగభద్ర ప్రవహిస్తోంది. ఆలూరు మండలం మేలగనూరు వద్ద ప్రవేశించి సంగమేశ్వరం వద్ద కృష్ణాలో కలుస్తుంది. పుష్కరాలకు లక్షల్లో భక్తులు వచ్చి స్నానాలు ఆచరిస్తారు. కరోనా వల్ల ప్రభుత్వం ఈ పుష్కరాలను ఎలా నిర్వహించాలనుకుంటోందో స్పష్టతనిచ్చి ఏర్పాట్లు చేయాల్సి ఉంది.