హైదరాబాద్ ఆనంద్‌నగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి(60) శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండగా ఆయన ఇద్దరు పిల్లలు గురువారం రాత్రి నుంచి 4 గంటలపాటు ఐదు కార్పొరేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లారు. స్పందించకపోవడంతో చివరకు నిమ్స్ ఆసుపత్రికి వెళ్లారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందారని నిర్ధారించారు. అయిదింటిలో ఏ ఒక్క ఆసుపత్రి స్పందించినా తమ తండ్రి దక్కేవారిని వారు వాపోయారు.
సకాలంలో స్పందించక మహిళ కన్నుమూత
ఆస్తమాతో బాధపడుతున్న దమ్మాయిగూడకు చెందిన సత్తెమ్మదీ ఇలాంటి పరిస్థితే. భర్త చనిపోయారు. ఈమెకు ముగ్గురు పిల్లలు. ఆమె శ్వాస సంబంధిత సమస్యతో సతమతమవుతుండడంతో అల్లుళ్లు ప్రైవేటు అంబులెన్స్‌లో తొలుత ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొవిడ్ లక్షణాలున్నాయని గాంధీ ఆసుపత్రికి పంపించారు. కరోనా పరీక్షలు చేయించుకొని రావాలంటూ వారు ఛాతీ ఆసుపత్రికి పంపారు. ఛాతీ ఆసుపత్రిలో పడకలు లేవని చెప్పడంతో మరో రెండు ప్రైవేటు ఆసుపత్రులను సంప్రదించారు. వారూ అదే సమాధానం ఇవ్వడంతో కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసుకెళ్లారు. కరోనా అనుమానితుల తాకిడి నేపథ్యంలో వైద్యులను సంప్రదించడం సాధ్యపడలేదు. ఈలోగా అంబులెన్స్‌లో ఆక్సిజన్ అయిపోవడంతో ఆమె కిందపడిపోయింది. ఈ విషయం మీడియా ఛానళ్లలో రావడంతో ఆసుపత్రి వైద్యాధికారులు స్పందించారు. ఆమె ఆంబులెన్స్‌లో ఉందని గుర్తించిన కింగ్‌కోఠి ఆసుపత్రి వైద్యాధికారి మల్లికార్జున్.. అంబులెన్స్ సిబ్బందిని మందలించారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 ప్రాంతంలో ఐసీయూలో చేర్చుకొని చికిత్సను ప్రారంభించారు. సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో ఆమె కన్నుమూసింది.