నష్టాల్లోని సంస్థను గట్టెక్కించేందుకు ఆర్టీసీ అనేక మార్గాలను అన్వేషించింది. అందులో భాగంగా కార్గో సేవలను విస్తృతం చేసింది. డొక్కు బస్సుల స్థానంలో అద్దెబస్సులను దింపింది. ఎంతచేసినా ఆక్యుపెన్సీ రేషియోను పెంచుకోలేకపోయింది. వీటన్నింటికి తోడు కరోనా వైరస్ ప్రజారవాణాపై తీవ్ర ప్రభావం చూపింది. కొవిడ్ కొంతమేరకు అదుపులోకి రావడం.. డీజిల్ ధరలు భగ్గుమనడం వల్ల జనం మెల్లగా ఆర్టీసీ వైపు మళ్లారు. మెల్లగా కోలుకుంటుందని.. అన్ని బస్సులు రోడ్డెక్కించవచ్చని భావిస్తున్న సంస్థకు కరోనా సెకండ్ వేవ్ మరోసారి గడ్డుకాలాన్నే మోసుకొచ్చింది. సుడిగుండంలోంచి బయటపడే మార్గాలు మరింత కూరుకుపోయేలా చేస్తున్నాయి. ప్రయాణీకుల సామర్థ్యం పెంచుకునేందుకు ప్రవేశపెట్టిన వజ్ర బస్సుల పరిస్థితి చివరకు తుక్కుగా మారేలా తయారైంది.
ఛార్జీలు ఎక్కువగా ఉండడంతో..
ఆర్టీసీ తొలిసారిగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వజ్ర మినీ బస్సులను కొనుగోలు చేసింది. 2017లో 21 సీట్ల సామర్థ్యం ఉన్నవి సమకూర్చుకుంది. మినీ బస్సుల్లో సీట్లు అనువుగా లేవని ప్రయాణీకులు అసంతృప్తి వెలిబుచ్చారు. సీటు సీటుకు మధ్య ఖాళీ స్థలం తక్కువగా ఉండి ఇరుకుగా భావించారు. ఆ తర్వాత 18 సీట్ల వజ్ర మినీ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ విధానం, సీసీ కెమెరాలు, వాయిస్ సిస్టం, అగ్ని ప్రమాద నివారణ చర్యలు తదితర సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంది. హైదరాబాద్‌లోని ముఖ్యమైన ప్రాంతాల నుంచి వరంగల్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలకు సర్వీసులు నడిపించారు. ప్రయాణీకులను ఇంటి వద్ద నుంచే తీసుకెళ్లడం.. అక్కడే దింపడం వంటి సేవలు అందించింది. అయినా ఈ ప్రయోగమూ వికటించింది. సుమారు వంద బస్సులు సరిగ్గా రెండున్నరేళ్లు తిరగకుండానే డిపోలకే పరిమితమయ్యాయి. ఏసీ బస్సుల కంటే ఛార్జీలు ఎక్కువ ఉండడం వల్ల ప్రజలు ఆదరించలేదు.
తలలు పట్టుకుంటున్నారు..