No Unity in Telangana Congress :కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలోకాంగ్రెస్ పార్టీ పుంజుకుంటూ వస్తోంది. క్రమంగా జనాదరణ పెరుగుతున్న కాంగ్రెస్‌ని మరింత బలోపేతం చేసే దిశలో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే(Manik Rao Thackrey), ముగ్గురు ఇంచార్జ్ కార్యదర్శులు పని చేయాల్సి ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(TPCC Chief Revanth Reddy), సీఎల్పీ నేత భట్టి విక్రమార్కలతో చర్చించి కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రణాళికాబద్ధంగా అమలయ్యేట్లు చూడాల్సి ఉంది. కానీ తెలంగాణలో ఆ దిశగా కార్యాచరణ, కార్యక్రమాలు జరగడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. అంతకు ముందు రాష్ట్ర ఇంచార్జ్ కార్యదర్శులుగా ఉన్న బోసురాజు కర్ణాటక మంత్రి పదవి చేపట్టడం, మరో కార్యదర్శి జావిద్‌పై ఆరోపణలు రావడంతో తొలగించి వారి స్థానంలో మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్‌లను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఇంఛార్జ్ కార్యదర్శుల్లో ముందు నుంచి ఉన్న రోహిత్ చౌదరిని కొనసాగించారు.
Telangana Congress Controversy : రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్‌గా బాధ్యతలు నిర్వర్తించే నాయకులుపీసీసీ అధ్యక్షుడు, సీఎల్పీ నేతలను కలుపుకొని పార్టీ కార్యక్రమాలను రూపకల్పన చేస్తూ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే దిశలో ముందుకు వెళ్లాల్సి ఉంది. అదేవిధంగా ఇంచార్జ్ కార్యదర్శులుగా ఉన్న ముగ్గురు తమకు కేటాయించిన ప్రాంతంలో నెలలో కనీసం 15 రోజులు ఉండి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, నాయకుల మధ్య సమన్వయం ఉండేటట్లు చూడడం లాంటివి చూడాల్సి ఉంది. కొత్తగా నియామకమైన మన్సూర్ అలీఖాన్, విష్ణునాథ్‌లు ఒకట్రెండు నియోజకవర్గాలలో పర్యటించి సమీక్షలు నిర్వహించారు. కానీ ముందునుంచి ఏఐసీసీ ఇంచార్జ్ కార్యదర్శిగా ఉన్న రోహిత్ చౌదరి మునుగోడు ఉపఎన్నికలు మినహా క్షేత్ర స్థాయికి వెళ్లిన దాఖలాలు లేవని, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రేని అంటి పెట్టుకుని ఉంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి.
Lack of Coordination in Telangana Congress : ఇటీవల చోటు చేసుకున్న ఘటనలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఎన్నికల సమయంలో తేనెతుట్టె లాంటి మండల కమిటీల ఏర్పాటును వీరు భుజానికెత్తుకున్నారు. పీసీసీ, సీఎల్పీలకు తెలియకుండానే మాణిక్‌రావ్ ఠాక్రే , రోహిత్ చౌదరిలు దాదాపు 600 మండలాలకు అధ్యక్షులను నియమించారు. పార్టీకి దూరంగా ఉన్న కొందరు నేతల్ని కలిసేందుకు వెళ్లేటప్పుడు కూడా పీసీసీ, సీఎల్పీలకు సమాచారం ఇవ్వలేదని తెలిసింది. మందకృష్ణ మాదిగ, ఆర్.కృష్ణయ్యలను కలిసినప్పుడు కూడా ఇలాగే జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.కనీసం స్థానిక వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్‌కు, స్థానిక డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్‌కు గానీ సమాచారం లేదు. ఇక్కడ కూడా పీసీసీ, సీఎల్పీలతో కలిసి వెళ్లాల్సి ఉండగా కనీసం సమాచారం కూడా ఇవ్వలేదన్న విమర్శలు ఉన్నాయి.