తెలంగాణ

telangana

ETV Bharat / state

Union Budget 2022: తెలంగాణకు తీవ్ర నిరాశ.. కొత్త రైళ్లు, లైన్లూ లేవు - రైల్వే బడ్జెట్​ 2022

Union Budget 2022: కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చింది. రైల్వేకు గతేడాది కంటే రూ.30 వేల కోట్లు అధికమని ఆ శాఖ ఘనంగా చెప్పినా రాష్ట్రానికి ఆ మేరకు కేటాయింపులు కనిపించడం లేదు. నూతనంగా రైల్వే లైన్లు మంజూరు చేయలేదు. కొత్త రైళ్లూ ఇవ్వలేదు.

Union Budget 2022
railway beget 2022

By

Published : Feb 3, 2022, 5:31 AM IST

Updated : Feb 3, 2022, 6:27 AM IST

Union Budget 2022: బుల్లెట్‌ రైలు, కాజీపేటలో కోచ్‌ ఫ్యాక్టరీ వంటి భారీ ప్రాజెక్టులేవీ రాలేదు. నూతనంగా రైల్వే లైన్లు మంజూరు చేయలేదు. కొత్త రైళ్లూ ఇవ్వలేదు. అత్యాధునిక, కొత్తతరం రైళ్లు అంటూ వందేభారత్‌ పేరుతో ఊరించినా ఈ ఏడాది కేటాయింపుల్లో వాటి ఊసే లేదు.. మొత్తంగా కేంద్ర బడ్జెట్‌ తెలంగాణకు తీవ్ర నిరాశ మిగిల్చింది. రైల్వేకు గతేడాది కంటే రూ.30 వేల కోట్లు అధికమని ఆ శాఖ ఘనంగా చెప్పినా రాష్ట్రానికి ఆ మేరకు కేటాయింపులు కనిపించడం లేదు. రైల్వే పింక్‌బుక్‌ వివరాల ప్రకారం గత బడ్జెట్లలో మంజూరై, నిర్మాణంలో ఉన్న నూతన ప్రాజెక్టుల్లో కొన్నింటికే.. డబ్లింగ్‌ లైన్లకు, చర్లపల్లి శాటిలైట్‌ టెర్మినల్‌కు కొంతమేర నిధులు ఇచ్చారు. ద.మ.రైల్వే జోన్‌ విభజన జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ రైల్వే డివిజన్లే మిగులుతాయి. మరొకటి మహారాష్ట్రలోని నాందేడ్‌లో ఉంటుంది. కాజీపేట కేంద్రంగా కొత్తరైల్వే డివిజన్‌ ఏర్పాటుచేయాలన్న డిమాండ్‌పైనా స్పందన లేదు. విశాఖపట్నం కేంద్రంగా ప్రకటించిన సౌత్‌కోస్ట్‌ కొత్త రైల్వేజోన్‌కి ఈసారి రూ.40 లక్షలే బడ్జెట్‌లో కేటాయించారు. అంటే ఈ సంవత్సరం ద.మ.రైల్వే జోన్‌ విభజన ప్రక్రియ పూర్తవుతుందా? అన్న సందేహాలున్నాయి.

ఎంఎంటీఎస్‌కు రూ.20 లక్షలే..

  • హైదరాబాద్‌లో రెండో దశ ఎంఎంటీఎస్‌ పనులకు రూ.10 లక్షలే ఇచ్చారు. ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి (రాయగిరి) రెండోదశ విస్తరణ ప్రాజెక్టుకు సైతం రూ.10 లక్షలే. రెండోదశలో తమ వంతు వాటా మించి ఖర్చు చేశామని, రాష్ట్ర ప్రభుత్వం నుంచే నిధులు రావాలని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. యాదాద్రి ఎంఎంటీఎస్‌ విషయంలోనూ రాష్ట్ర ప్రభుత్వం నిధులిచ్చి ముందుకు రావాలంటోంది.
  • కాజీపేట పీరియాడికల్‌ ఓవర్‌హాలింగ్‌ ప్రాజెక్టుకు కేంద్రం రూ.45 కోట్లే ఇచ్చింది. 2016-17లో రూ.269.78 కోట్ల అంచనా వ్యయంతో ఇది మంజూరైంది. అయిదేేళ్ల క్రితం రూ.రెండొందల కోట్ల పైచిలుకు నిధుల్ని బడ్జెట్‌లో కేటాయించినా, భూసమస్య ఉందని ఆ నిధుల్ని రైల్వే వెనక్కి తీసుకుంది. ఇప్పుడు సమస్య పరిష్కారమైంది. కానీ రూ.45 కోట్లే ఇచ్చారు. మరోపక్క అంచనా వ్యయమూ పెరిగింది. ఈ లెక్కన ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు కనీసం నాలుగైదేళ్లు పట్టే అవకాశం ఉంది.
  • హైదరాబాద్‌లో ప్రధాన టెర్మినళ్లపై ఒత్తిడి తగ్గించేందుకు చర్లపల్లిలో నిర్మిస్తున్న శాటిలైట్‌ టెర్మినల్‌కు రూ.69.99 కోట్లు ఇవ్వగా, నాగులపల్లి ప్రస్తావన లేదు.
  • రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా భూమి ఇవ్వడంతో పాటు నిధుల్లో కూడా మూడోవంతు వాటా భరిస్తున్న మనోహరాబాద్‌-కొత్తపల్లి లైనుకు గతేడాది రూ.325 కోట్లు ఇచ్చిన రైల్వేశాఖ, ఈసారి రూ.60 కోట్లకే పరిమితం చేసింది. ప్రస్తుతం మనోహరాబాద్‌ నుంచి గజ్వేల్‌ వరకు నిర్మాణం పూర్తయింది. సిద్దిపేట వైపు పనులు పురోగతిలో ఉన్నాయి. సిరిసిల్ల మీదుగా కొత్తపల్లి వరకు పూర్తయితే సికింద్రాబాద్‌-కరీంనగర్‌ వరకు రైల్వేలైను అందుబాటులోకి వస్తుంది. ఇంత కీలక ప్రాజెక్టుకూ నిధుల కేటాయింపులో రైల్వేశాఖ నిర్లక్ష్యం చూపింది.

రూ.2,480 కోట్లకు ఇచ్చింది రూ.వెయ్యి

తెలుగురాష్ట్రాల మధ్య ఎంతో డిమాండ్‌ ఉన్న రైల్వే లైను బీబీనగర్‌-గుంటూరు. ఈ మార్గంలో రెండోలైన్‌ నిర్మాణ అంచనా వ్యయం రూ.2,480 కోట్లయితే రూ.వెయ్యి ఇచ్చారు. దశాబ్దాల క్రితం మంజూరైన నల్గొండ-మాచర్లకూ కేటాయించింది రూ.వెయ్యే. కొండపల్లి-కొత్తగూడెం, మణుగూరు-రామగుండం లైన్లకు సైతం రూ.వెయ్యేసి చొప్పున బడ్జెట్‌లో మంజూరుచేశారు.

ఇదీచూడండి:

Last Updated : Feb 3, 2022, 6:27 AM IST

ABOUT THE AUTHOR

...view details