తెలంగాణ

telangana

By

Published : Aug 24, 2020, 7:26 AM IST

ETV Bharat / state

ఇళ్లలో ఉన్న కరోనా బాధితులకు అందని సేవలు

హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకుని పాజిటివ్‌గా తేలిన వారిలో 90శాతం ఇళ్లలోనే ఉంటున్నారు. వారికి అందించే సేవల్లో స్థానిక సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది.

ఇళ్లలో ఉన్న కరోనా బాధితులకు అందని సేవలు
ఇళ్లలో ఉన్న కరోనా బాధితులకు అందని సేవలు

‘"అల్వాల్‌ పరిధిలో ఓ వ్యక్తికి పదిరోజుల క్రితం ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షల్లో కరోనా పాజిటివ్‌ వచ్చింది. పరీక్షా కేంద్రం నుంచి నేరుగా ఇంటికి వెళ్లిన అతనికి మూడురోజుల వరకూ జీహెచ్‌ఎంసీ, వైద్యశాఖల నుంచి ఫోన్లు రాలేదు. నాలుగోరోజు కంట్రోల్‌రూమ్‌కి చేసినా స్పందన లేదు. దీంతో ప్రైవేట్‌ వైద్యుల సూచనలు తీసుకొని స్థానికంగా ఔషధాలు కొనుగోలు చేశాడు."

"‘కాప్రా సర్కిల్‌ కేఎల్‌రెడ్డినగర్‌లోని ఓ ఇంట్లో ఏడుగురు పరీక్షలు చేయించుకోగా, ఐదుగురికి పాజిటివ్‌ వచ్చింది. సాయం చేసేవారు లేక మరుసటిరోజు ఇంట్లోని బాధితురాలే స్థానిక యూపీహెచ్‌సీకి వెళ్లారు. అక్కడ మందులు ఇవ్వడం కుదరదని చెప్పడం వల్ల తిరిగొచ్చారు. తర్వాతి రోజునే ఇంట్లో ఉన్న పిల్లలిద్దరికీ జ్వరం తీవ్రంగా ఉండటంతో మళ్లీ వెళ్తే కొవిడ్‌ కంట్రోల్‌రూమ్‌ని సంప్రదించాలని సిబ్బంది సూచించారు. ఫోన్‌ చేస్తే ‘మీ నివేదిక మాకందలేదు.. స్థానిక అధికారులే చూసుకుంటారు’ అన్న సమాధానం వచ్చింది. బాధితులు ఇంట్లోనే సొంత వైద్యం చేసుకోగా.. పదిరోజుల తర్వాత జీహెచ్‌ఎంసీ సిబ్బంది వచ్చి మందులు అందించి, పరిసరాల్లో శానిటేషన్‌ చేశారు".

‘‘ సికింద్రాబాద్‌ పరిధిలోని ఓ కుటుంబంలో ఇద్దరు మహిళలకు పాజిటివ్‌ వచ్చింది. అధికారులు ఫోన్‌ చేస్తారని, ఇంటికి వెళ్లాలని పీహెచ్‌సీ సిబ్బంది చెప్పడం వల్ల ఐసోలేషన్‌లో ఉన్నారు. మూడురోజులైనా ఫోన్‌ రాలేదు. పరిచయమున్న స్థానిక నేతల జోక్యంతో ఐదోరోజు ఇంటికి ఐసోలేషన్‌ కిట్‌తో పాటు శానిటైజేషన్‌ చేసేందుకు బల్దియా సిబ్బంది వచ్చారు.’’

సేవల్లో అలసత్వం

హైదరాబాద్‌లో కరోనా పరీక్షలు చేయించుకుని పాజిటివ్‌గా తేలిన వారిలో 90శాతం ఇళ్లలోనే ఉంటున్నారు. వారికి అందించే సేవల్లో స్థానిక సిబ్బంది అలసత్వం వహిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జీహెచ్‌ఎంసీ, వైద్యారోగ్య శాఖల మధ్య సమన్వయ లోపం ఉంది. రోజుల తరబడి ఐసోలేషన్‌ కిట్లు, ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూసి చివరికి కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కి ఫోన్‌ చేసినా స్పందన ఉండడంలేదు.

బాధితులే తిరగాల్సిన పరిస్థితి

గ్రేటర్‌ పరిధిలో కరోనా పరీక్షలకు రోజులపాటు నిరీక్షించాల్సిన పరిస్థితి. స్థానికంగా ఎదురుచూడలేక వేరే పీహెచ్‌సీకి వెళ్లి పరీక్ష చేయించుకుంటే అక్కడ ఫలితం చెప్పి మందుల కోసం బాధితుల నివాసప్రాంత సమీపంలో ఉండే ఆరోగ్యకేంద్రానికి వెళ్లమని చెబుతున్నారు. అక్కడికెళ్తే ‘ఐసోలేషన్‌ కిట్లు, మందులు ఇవ్వాళ లేవు.. రేపు రండి’ అంటూ వెనక్కి పంపుతున్నారు. దీంతో బాధితులే సొంత వైద్యానికి ప్రైవేట్‌ మందుల దుకాణాలను ఆశ్రయిస్తున్నారు. కేవలం తమ ప్రాంతానికి చెందిన వారికే మందులివ్వాలని ఆదేశాలు ఉన్నట్లు పీహెచ్‌సీ సిబ్బంది చెబుతున్నారు. కొన్నిచోట్ల బాధితుడికి ఫలితం తెలిసిన వారానికి యంత్రాంగానికి సమాచారం వెళ్తోంది. ఇంకొన్నిచోట్ల వారం తర్వాత సహాయ చర్యలు చేపడుతున్నారు.

ఇదీ చదవండి:భద్రాద్రి @ 44.6: గోదారి తగ్గుముఖం... నీటిలోనే మన్యం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details