తెలంగాణ

telangana

ETV Bharat / state

పారిశుద్ధ్య కార్మికులను... పట్టించుకునే నాథుడేడీ?

కరోనా కమ్మేస్తోన్న వేళ... మాస్క్‌లు ధరించాలని ప్రభుత్వం చెబుతోంది. రోజూ చెత్త సేకరించే కార్మికులకు మాత్రం మాస్క్‌లే కాదు... చేతికి గ్లౌజ్‌లూ ఉండటం లేదు. రక్షణ ఉపకరణాలు కొనుగోలు చేసి.. ఇచ్చామని అధికారులు అంటున్నా అవి కార్మికులకు చేరలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కరోనా రక్షణ చర్యల పేరుతో కొన్న సామగ్రి విషయంలోనూ అవకతవకలు జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి.

కాపాడేటోళ్లకు.. కవచాలేవీ?
కాపాడేటోళ్లకు.. కవచాలేవీ?

By

Published : Mar 27, 2020, 8:29 AM IST

రోజూ 8గంటలపాటు అనారోగ్యకర వాతావరణంలో పారిశుధ్ద్య కార్మికులు పనిచేస్తున్నారు. వీరి రక్షణకు ప్రభుత్వం యేటా రూ.10కోట్ల బిల్లులు మంజూరు చేస్తోంది. రెండు నెలలకోసారి పొరుగు సేవల కార్మికులకు, ఆర్నెల్లకోసారి పూర్తిస్థాయి కార్మికులకు 12 రకాల వస్తువులు ఇవ్వాలి. నిధులు ఉన్నా ఆ వస్తువులు క్షేత్రస్థాయిలో కార్మికుల వద్ద మాత్రం కనిపించడం లేదు. కొనుగోలు చేయగానే కొన్ని ప్రాంతాల్లో మొదటి విడతగా కొన్ని వస్తువులను ఇచ్చి... ఆ తర్వాత పంచకుండా పోగు చేసిన వస్తువులను అవసరమైనప్పుడల్లా ఫొటో తీసి... కొత్తగా కొనుగోలు చేసినట్లు చూపిస్తున్నారనే విమర్శలున్నాయి. తాజాగా జీహెచ్‌ఎంసీలో అదే జరిగిందని సమాచారం.

కరోనా బూచిని చూపి..

ప్రమాదకర వైరస్‌ను బూచిగా చూపించి పలు జోన్ల అధికారులు అవకతవకలకు పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. అబిడ్స్‌ సర్కిల్‌లో పనిచేసే పూర్తిస్థాయి ఉద్యోగిని భర్త బల్దియాలోనే గుత్తేదారుగా పనిచేస్తారు. అతను నడిపిస్తోన్న ఏజెన్సీకే ఎప్పుడూ గ్లౌజులు, మాస్కులు, ఇతర రక్షణ వస్తువుల కాంట్రాక్టు దక్కుతుంది. ఉన్నతాధికారులతో కలిసి వాటిని పంపిణీ చేయకుండా నిల్వ చేస్తారు. మరోసారి టెండర్లు పిలిచినప్పుడు అవే వస్తువులను సరఫరా చేసినట్లు చూపిస్తారు. మళ్లీ అదే తంతు జరుగుతుందని, తదుపరి కాంట్రాక్టుకూ వాటినే ఉపయోగించుకుంటారని ఉన్నతాధికారులు బాహాటంగానే ఆరోపిస్తున్నారు.

జోన్లలో పంపిణీ జరగలేదు..

ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులకు రోజుకో మాస్కు, రెండ్రోజులకో గ్లౌజు జత ఇవ్వాలని వైద్యులు చెబుతున్నారు. అదే లెక్కన జోన్ల వారీగా ఇటీవల బల్దియా పలు రక్షణ వస్తువులను కొనుగోలు చేసిందని, వాటిని కార్మికులకు ఇవ్వకుండా గతంలో మాదిరి దాచిపెట్టారని విమర్శలున్నాయి. ఇటీవల జీహెచ్‌ఎంసీ పలు పర్యాటక, రద్దీ ప్రాంతాల్లోని పారిశుద్ధ్యం బాధ్యతను ప్రైవేటు ఏజెన్సీకి ఇచ్చింది. దాని కింద పనిచేస్తోన్న కార్మికులకు సైతం రక్షణ లేదు.

డీఆర్‌ఎఫ్‌కు మాత్రమే రక్షణ.. రోజులో 8గంటలు అనారోగ్యకర వాతావరణంలో పనిచేస్తోన్న కార్మికులకు దక్కని రక్షణ, అదే బల్దియాకు చెందిన విపత్తు నివారణ దళానికి అందింది. సదరు విభాగంలోని 300ల మంది కార్మికులకు నాణ్యమైన ఏకరూప దుస్తులు, రక్షణ వస్తువులను అందిస్తున్నారని... పారిశుద్ధ్య, మలేరియా నివారణ, పశువైద్య విభాగాల కార్మికులపై జీహెచ్‌ఎంసీ వివక్ష చూపిస్తోందని కార్మిక సంఘం నేత యు.గోపాల్‌ ఆరోపించారు.

ఇక కేంద్ర కార్యాలయం నుంచి..

ఇటీవలి కాలం వరకు జోన్లవారీగా గ్లౌజులు, మాస్కులు, ఇతర రక్షణ వస్తువుల కొనుగోలు జరిగింది. ఆరోపణలు వెల్లువెత్తుతుండటంతో ఇక కేంద్ర కార్యాలయం నుంచి టెండర్లు పిలవాలని నిర్ణయించినట్లు ముఖ్య వైద్యాధికారి అమర్‌ ‘తెలిపారు. రూ.10కోట్ల విలువైన వస్తువులకు టెండరు పిలిచే ప్రక్రియ నడుస్తుందని ముఖ్య రవాణా అధికారి నాగేశ్వరరావు వివరించారు. అవకతవకలకు తావు లేకుండా టెండర్లు పిలిచి, గతంకన్నా నాణ్యమైన వస్తువులను సమకూర్చుకుంటామన్నారు.

పొరుగు సేవల సిబ్బంది 18వేలు

పూర్తి స్థాయి కార్మికులు 3100

దోమల నివారణ విభాగ కార్మికులు 2100

పశువైద్య విభాగం ఆధ్వర్యంలోని వారు 250

ఇదీ చూడండి :కరోనా మూడో దశకు చేరుకుంటే.. ఏం చేద్దాం: ఈటల

ABOUT THE AUTHOR

...view details