ఖగోళంలో ఆదివారం అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతుంది. సూర్యుడి చుట్టు చంద్రుడు పరిభ్రమిస్తూ వలయాకార సూర్యగ్రహణాన్ని ఏర్పర్చబోతున్నాడు. ఈ అరుదైన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో, భిన్న రకాలుగా కనిపించబోతోంది.
ఉదయం 9.16 నిమిషాల నుంచి గ్రహణం
ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9. 16 నిమిషాల నుంచి మధ్యాహ్నం 3.04 నిమిషాల వరకు ఉండే సూర్యగ్రహణం... దేశంలో 9 గంటల 56 నిమిషాలకు కనిపించనుంది. మధ్యాహ్నం 2.29 నిమిషాల వరకు కొనసాగే సూర్యగ్రహణాన్ని తొలుత గుజరాత్ ద్వారకా ప్రజలు వీక్షించబోతున్నారు. చివరగా అస్సోం వాసులు కనిపించనుంది. దేశంలో కనిపించే సూర్యగ్రహణం కేవలం పాక్షికంగా మాత్రమే ఉంటుందని.. హైదరాబాద్లోని ప్లానెటరీ సొసైటీ ఇండియా స్పష్టం చేసింది.
ఆదివారం సంభవించే సూర్యగ్రహణంపై అధ్యయనం చేసిన ప్లానెటరీ సొసైటీ... ప్రపంచవ్యాప్తంగా సూర్యగ్రహణం వలయాకారంగా ఉంటుందని పేర్కొంది. ఈ గ్రహణంపై ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్లానెటరీ సొసైటీ ఇండియా వివరించింది. సెంటర్ ఫర్ స్పేస్ మెడిసిన్ సభ్యులతో కలిసి సూర్యగ్రహణంలో సంభవించే పరిణామాలను వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం తక్కువే...
మిగతా రాష్ట్రాలతో పోల్చితే.. తెలుగు రాష్ట్రాల్లో సూర్యగ్రహణ ప్రభావం తక్కువేనని ప్లానెటరీ సొసైటీ తెలిపింది. తెలంగాణలో 51 శాతం, ఆంధ్రప్రదేశ్లో 46 శాతం మేర ఉంటుందని ప్లానెటరీ సొసైటీ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ పేర్కొన్నారు.
హైదరాబాద్లో 10.15 గంటలకు ప్రారంభం...
హైదరాబాద్లో సూర్యగ్రహణం 10.15 నిమిషాలకు ప్రారంభమై మధ్యాహ్నం 1.40 నిమిషాలకు ముగుస్తుందన్నారు. విజయవాడలో 10.21 నిమిషాల నుంచి మధ్యాహ్నం 1.49 నిమిషాల వరకు సూర్యగ్రహణం కొనసాగుతుందని పేర్కొన్నారు.