తెలంగాణ

telangana

ETV Bharat / state

వివాహ ముహూర్తాలకు మూఢాల అవరోధం - పెళ్లికి ముహుర్తాలు

అబ్బాయి హైదరాబాద్‌లో బీటెక్‌ అనంతరం జర్మనీ వెళ్లి పీజీ పూర్తిచేసి మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్లి చేసుకోవాలని జనవరిలో హైదరాబాద్‌కు వచ్చాడు. జాతకాలు కుదరలేదని చాలా సంబంధాలను తల్లిదండ్రులు తిరస్కరించారు. చివరికి జాతకాలు సహా అన్నీ నచ్చిన అమ్మాయితో సంబంధం ఖాయమైంది. కానీ పెళ్లి ముహూర్తం కోసం మే నెల దాకా వేచి చూడాల్సి వస్తోంది. ఇప్పుడు మూఢం...ముహూర్తాలు లేవని పురోహితులు చెప్పడమే అందుకు కారణం.

no muhurtham for wedding moments in magha masam
వివాహ ముహూర్తాలకు మూఢాల అవరోధం

By

Published : Mar 21, 2021, 6:52 AM IST

మాఘమాసం ఎప్పుడొస్తుందో...అంటూ పాడుకోవడానికి ఈసారి అవకాశం లేకపోయిది. పందిళ్లు.. సందళ్లు.. తాళాలు.. తప్పెట్లు.. భాజాలు.. భజంత్రీలు లేకుండా ఈసారి మాఘమాసం మౌనంగా వెళ్లిపోయింది. ఫాల్గుణం నడుస్తోంది. తర్వాత చైత్రమూ ఉపయోగం లేదు. ఇక మే నెలలో వచ్చే వైశాఖమాసం కోసమే తెలుగు రాష్ట్రాల యువతీ, యువకులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే వారి జీవితాలను ఆనందాల మలుపుతిప్పే పెళ్లి ఘడియలున్నది ఈ వైశాఖంలోనే. అప్పటిదాకా మంచి ముహూర్తాలు లేక వారే కాకుండా తల్లిదండ్రులు సైతం నిరుత్సాహంగానే ఉన్నారు.ఎందుకంటే ఇప్పుడు అందరి సమాధానం ఒక్కటే. ‘మంచిరోజులు లేవు. మూఢం నడుస్తోంది’ అని.

మాఘంలోనే అధికం

సాధారణంగా ఏటా వివాహాలు మాఘం, వైశాఖం, శ్రావణ మాసాల్లో జరుగుతుంటాయి. వైశాఖమాసం మే నెలలో వస్తుంది. అప్పుడు వేసవి ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అలాగే శ్రావణం జులై, ఆగస్టులో మంచి వర్షాలు పడే సమయంలో వస్తుంది. అప్పుడు వర్షాలతో ఇబ్బందులుంటాయి. ఇలాంటి సమస్యలేమీ లేకుండా వాతావరణం అనుకూలంగా ఉంటుందని ఎక్కువ మంది మాఘమాసంలో పెళ్లిళ్లు చేయడానికి ఇష్టపడుతుంటారు. కానీ ఈసారి మాఘం అంతా మూగవోయింది. గత నెల 10 వరకు గురుమూఢం, 17 నుంచి శుక్రమూఢం ఉన్నందున పెళ్లి పనులు చేయడానికి మంచి రోజులు లేవని అన్నీ ఆపేశారు. తిరిగి మే 12న వైశాఖ మాసం ప్రారంభమైనప్పటి నుంచి జులై 8న జ్యేష్ఠమాసం ముగిసేవరకూ పెళ్లి ముహూర్తాలున్నాయి. జులై 9 నుంచి ఆగస్టు 10 వరకూ ఆషాఢమాసంలో మళ్లీ పెళ్లి ముహూర్తాలు ఉండవని హైదరాబాద్‌కు చెందిన పురోహితుడు భాస్కర శర్మ చెప్పారు. ప్రస్తుతం జనవరి నుంచి మే మధ్యవరకూ లేకపోవడం, తిరిగి జులైలో ఆషాఢమాసం ఉన్నందున మే 13 నుంచి జులై 7 మధ్య కాలంలో పెళ్లి ముహూర్తాల ఖరారు కోసం తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు.

ఉపాధిపై ప్రభావం

గత జనవరి నుంచి మే రెండో వారం దాకా మూఢం కారణంగా ప్రస్తుతం వివాహ కార్యక్రమాలన్నీ పూర్తిగా స్తంభించాయి. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కల్యాణ మండపాలు, ఇతర ఫంక్షన్‌హాళ్లు వెలవెలబోతున్నాయి. భజంత్రీలు వాయించేవారు, పురోహితులు, వంటవాళ్లు, ఫంక్షన్‌హాళ్ల సిబ్బంది అంతా ఉపాధి లేక ఉసూరుమంటున్నారు. ఏటా మాఘమాసంలో కనీసం రూ.10 లక్షలకు పైగా మిగిలేవి....ఈసారి పది రూపాయల ఆదాయమూ లేదని హైదరాబాద్‌కు చెందిన ఏసీ ఫంక్షన్‌హాలు యజమాని ఒకరు చెప్పారు.

విహార యాత్రల్లో పురోహితులు

మూఢంతో మంచిరోజలు లేవని పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు చేయలేకపోతున్నామని ఎక్కువశాతం మంది ప్రజలు నిరాశపడుతున్నా ఈరోజులు తమకు అనుకూలంగా ఉన్నాయని కొందరు పురోహితులు ఆనందపడుతున్నారు. మూఢం కారణంగా పనులు లేకపోవడంతో ఎంతోకాలంగా పెండింగులో ఉన్న మొక్కులు తీర్చుకోవడానికి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నారు.

రెండు నెలల్లో లక్షకు పైగా పెళ్లిళ్లు...

మే నెల రెండో వారం నుంచి జులై మొదటివారం వరకూ తెలుగు రాష్ట్రాల్లో లక్షకు పైగా జంటలు వివాహబంధంతో ఒక్కటయ్యేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే 10 వేలకు పైగా పెళ్లిళ్లు జరిగే అవకాశాలున్నాయని కూకట్‌పల్లికి చెందిన ఓ మ్యారేజ్‌బ్యూరో ప్రతినిధి చెప్పారు. మే చివరి వారంలో ఏ ఫంక్షన్‌హాలు కూడా దొరకడం లేదని, వాటిని గత 2 నెలల క్రితమే బుక్‌ చేసేసుకున్నారని అన్నారు. వాటికి డిమాండు పెరగడంతో అద్దెలు సైతం భారీగా పెంచేశారు. ఈ వ్యయం భరించలేక, మరోవైపు కరోనా కారణంగా పరిమితసంఖ్యలో అతిథులను పిలిచి ఇళ్ల వద్ద వేదికలు నిర్మించి పెళ్లిళ్లు చేయడానికి కొందరు యోచిస్తున్నారు. కరోనా వ్యాప్తి కారణంగా గతంలోలా ఇళ్ల వద్ద పెళ్లిళ్లు జరిగిన సంప్రదాయాలు ఇప్పుడు మళ్లీ కనపడుతున్నాయని ఏలూరుకు చెందిన పూజారి నారాయణ శర్మ చెప్పారు. గతేడాది మార్చి 22న లాక్‌డౌన్‌ పెట్టి మే దాకా పొడిగించడంతో అప్పుడు కూడా పెళ్లిళ్లు ఆగిపోయాయి. ఆ తరవాత కరోనా భయంతో వివాహాలు పెద్దగా జరగలేదు. విదేశాల నుంచి రాకపోకలపై అప్పట్లో కరోనా కారణంగా నియంత్రణ ఉండటం కూడా పెళ్లిళ్లపై కొంత ప్రభావం చూపింది. ఈ అవరోధాలన్ని దాటి మే నెలలో వచ్చే మంచి రోజుల మూహూర్తాల కోసం తల్లిదండ్రులు, యువతీ, యువకులు ఎదురుచూస్తున్నారు.

ఇదీ చూడండి:ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ను కలిసిన సురభి వాణీదేవి

ABOUT THE AUTHOR

...view details