సహకారంతో ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయుల పథకం (ఈజేహెచ్‌ఎస్)లో భాగంగా నెలకొల్పిన ఓపీ సేవల కేంద్రాల్లో (వెల్‌నెస్ సెంటర్లు) ఔషధాల కొరత వేధిస్తోంది. వైద్యులు సూచించిన మందుల్లో 20-30 శాతం మాత్రమే అందుబాటులో ఉండడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బు, మూత్రపిండాల వైఫల్యం తదితర దీర్ఘకాలిక జబ్బులకు ఉపయోగించే అతి ముఖ్యమైన మందులు కూడా లభ్యం కావడంలేదు. ఇక గత్యంతరం లేక బయటి దుకాణాల్లోనే కొనాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. కరోనా ప్రారంభమయ్యాక మందుల కొరత పెరిగిందని సమాచారం. రాష్ట్రంలోని 12 వెల్‌నెస్ సెంటర్లలోనూ ఇదే స్థితి ఉన్నట్లు 'ఈనాడు- ఈటీవీభారత్' పరిశీలనలో తేలింది.
ఓపీ పెరిగినా... అందని మందులు
ఉద్యోగులు, పింఛనుదారులు, పాత్రికేయులకు ఓపీలో వైద్యుని సంప్రదింపులు, నిర్ధారణ పరీక్షలు, ఔషధాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 2016లో తొలిసారిగా ఖైరతాబాద్‌లో వెల్‌నెస్ సెంటర్‌ను ప్రారంభించింది.ఆ తర్వాత రెండేళ్లలోనే రాష్ట్రంలో మరో 11 కేంద్రాలను నెలకొల్పింది. వీటికి క్రమేణా విశేష ఆదరణ లభించింది. రోజుకు సగటున 200-600 మంది వరకు రోగులు వస్తుంటారు. అత్యధికంగా ఖైరతాబాద్ కేంద్రానికి వస్తుంటారు. కొవిడ్ సమయంలో ఓపీకి వచ్చే వారి సంఖ్య తగ్గింది. జులై, ఆగస్టుల్లో సాధారణ సేవలు ప్రారంభం కావడంతో మళ్లీ పుంజుకుంది. ఇప్పుడు రోజూ 200-300 మంది వరకు వస్తున్నారు. ఇదే సమయంలో ఔషధ నిల్వలు కూడా తగ్గుముఖం పట్టాయి. వైద్యుడు 10 రకాల మందులు సూచిస్తే.. 2-3 రకాలవి మాత్రమే లభ్యమవుతున్నాయి. దీంతో వెల్‌నెస్ సెంటర్లకొచ్చే రోగుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు రోజుకు 40-100 మంది మాత్రమే వస్తుండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
మూణ్నెల్లుగా మరీ దుర్భరం
ఔషధాల కొరత మూణ్నెల్లుగా మరీ తీవ్రంగా మారినట్లుగా తెలుస్తోంది. అవసరాలకు తగ్గట్లుగా మందులను నిల్వ చేయాల్సి ఉండగా..అధికారుల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వైద్యునితో సంప్రదింపుల అనంతరం నెలకు సరిపడా మందులివ్వాల్సి ఉండగా..అందుబాటులో ఉన్న మందుల్లోనూ 10-15 రోజులకు మాత్రమే ఇస్తున్నారు. గతంలో సుమారు 150-200 రకాల ఔషధాల నిల్వలుండగా.. ఇప్పుడు 60-70 శాతం ఔషధాలు అందుబాటులో లేవని చేతులెత్తేస్తున్నారు. దాంతో దూర ప్రాంతాల నుంచి వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.