తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏడాది గడిచింది.. ఎత్తైన అగ్నిమాపక శకటం ఎక్కడా ? - హైదరాబాద్​ తాజా వార్తలు

వేసవి వచ్చినా... అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఎత్తైన అగ్నిమాపక శకటం కొనుగోలు వ్యవహారం మాత్రం ఇంకా పూర్తికాలేదు. దీనికి సంబంధించి ఏడాది కిందటే పరిపాలన అనుమతులు లభించినప్పటికీ శకటం కొనుగోలుకు మాత్రం బడ్జెట్​ కేటాయించలేదు. హైదరాబాద్ శివార్లలో బహుళ అంతస్తుల భవనాలు రూపుదిద్దుకుంటున్న నేపథ్యంలో... ఏదైనా భారీ అగ్నిప్రమాదం సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టం ముప్పు తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు.

No funds were allocated for the purchase of a high-altitude fire engine
ఇంకా పూర్తి కాని ఎత్తైన అగ్నిమాపక శకటం కొనుగోలు

By

Published : Apr 17, 2021, 4:28 AM IST

రాష్ట్రంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞనం కలిగిన ఆత్యంత ఎత్తైన అగ్నిమాపక శకటం కొనుగోలు వ్యవహారం ఇప్పటికీ కాగితాల్లోనే మగ్గుతోంది. 101 మీటర్ల ఎత్తైన అగ్నిమాపక శకటం కోసం ప్రత్యేకమైన హైడ్రాలిక్ ప్లాట్‌ ఫాంతో పాటు 18 మంది ప్రత్యేక సిబ్బంది అవసరమని... రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ప్రణాళిక రూపొందించింది. వీటికి ఏడాది కిందటే పరిపాలన అనుమతులు లభించడంతో... జిల్లా అగ్నిమాపక అధికారితో సహా 18 మంది సిబ్బందిని నియమించారు.

దేశంలో రెండు మాత్రమే...

నానక్ రాంగూడలోని వైఎస్సార్ భవన్ సమీపంలో హైడ్రాలిక్ ప్లాట్‌ఫాం ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించారు. ఇందుకు దాదాపు రూ.25 కోట్లు అవసరం అవుతుందని అంచనా వేశారు. కానీ ఇప్పటికీ బడ్జెట్​ మాత్రం కేటాయించలేదు. ప్రస్తుతం విదేశాలలో 112 మీటర్ల వరకు ఎత్తైన అగ్నిమాపక శకటాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మన దేశంలో మాత్రం చెన్నైలో 104 మీటర్లవి రెండు మినహా... మరే నగరంలోనూ వంద మీటర్ల కంటే ఎత్తైనవి లేవు.

హైడ్రాలిక్​ విధానం ద్వారా...

ప్రస్తుతం రాష్ట్రంలో 54 మీటర్లవి రెండు మాత్రమే ఉన్నాయి. సికింద్రాబాద్, మాదాపూర్ అగ్నిమాపక కేంద్రాల్లో వీటిని ఉంచారు. ఫిన్లాండ్​కు చెందిన బ్రాంటో సంస్థ నుంచి 2007లో వీటిని సమకూర్చుకున్నారు. ప్రతిపాదించిన ఆగ్నిమాపక శకటం హైడ్రాలిక్ విధానం ద్వారా అగ్నిమాపక సిబ్బంది పెద్ద భవంతుల్లోకి చేరుకునేలా వీటిని తీర్చిదిద్దారు. ఈ నిచ్చెనకే నీటి పైపు అనుసంధానమై ఉంటుంది. దాంతో 54 అడుగుల ఎత్తు నుంచి మంటలు ఆర్పవచ్చు.

ముప్పు తీవ్రత అధికమే...

హైదరాబాద్ శివార్లలో బహుళ అంతస్తుల భవనాలు రూపుదిద్దుకుంటున్నాయి. భవిష్యత్తులో 100 నుంచి 150 మీటర్ల ఎత్తయిన వాటిని నిర్మించే అవకాశాలూ ఉన్నాయి. ప్రస్తుతం భారీ స్థాయిలో నిర్మితమవుతున్న భవంతులకు 101 మీటర్ల ఎత్తైన శకటం తిరిగేలా స్థలం వదిలితేనే అనుమతులిస్తున్నారు. కానీ అసలు శకటం కొనుగోలుకే బడ్జెట్ లేకపోవడం ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. ఈ బహుళ అంతస్తుల ప్రాంతంలో ఏదైనా భారీ అగ్నిప్రమాదం సంభవిస్తే ఆస్తి, ప్రాణనష్టం ముప్పు తీవ్రంగా ఉంటుంది.

ఇదీ చదవండి: తల్లిని గొడ్డలితో నరికి చంపిన కుమారుడు

ABOUT THE AUTHOR

...view details