తెలంగాణ

telangana

ETV Bharat / state

రైల్వేలో తెలంగాణకు నిరాశే.. ఈసారి బుల్లెట్టు బండి లేనట్టే! - telangana railways

No Funds to South central Railway Sector: కేంద్రబడ్జెట్​లో ద.మ.రైల్వేకి నిధుల కేటాయింపుల వెల్లడి రెండ్రోజుల్లో ఉండనుంది. రైల్వేశాఖకు గతంలో కంటే అధికంగా నిధులు కేటాయించినప్పటికీ... తెలంగాణకు కొత్తగా భారీ రైల్వే ప్రాజెక్టులు దక్కే సూచనలు కనిపించడం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

No Funds to South central Railway Sector
No Funds to South central Railway Sector

By

Published : Feb 2, 2022, 7:18 AM IST

No Funds to South central Railway Sector: రాష్ట్రానికి కొత్తగా భారీ రైల్వే ప్రాజెక్టులు దక్కే సూచనలు కనిపించడం లేదు. సర్వే జరుగుతున్న ముంబయి-హైదరాబాద్‌ మార్గంతో పాటు హైదరాబాద్‌-విజయవాడల మధ్య కూడా బుల్లెట్టు రైలు ప్రాజెక్టు కావాలన్న డిమాండ్‌ బలంగా ఉంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్‌ గతేడాది బడ్జెట్‌ సమయంలో మూడు భారీ సరకు రవాణా నడవా ప్రాజెక్టుల్ని ప్రకటిస్తూ వాటి వివరాల్ని వెల్లడించారు. ఈసారి బడ్జెట్‌లో రైల్వేశాఖకు గతంలో కంటే అధికంగా నిధులు కేటాయింపు, వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ల గురించి మాత్రమే వివరించారు. అటు ఆర్థికమంత్రి, ఇటు రైల్వేమంత్రి విలేకరుల సమావేశంలో భారీ ప్రాజెక్టుల మంజూరు మాట ఎత్తలేదు. దీంతో ఈ సంవత్సరం కొత్తగా బుల్లెట్‌ రైలు ప్రాజెక్టుల మంజూరు, సర్వేకు అనుమతించే అవకాశాలు లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్‌లో మంత్రి దేశవ్యాప్తంగా రైల్వేశాఖకు చేసిన కేటాయింపులనే వెల్లడించారు. దక్షిణ మధ్య రైల్వే సహా వివిధ జోన్లకు చేసిన కేటాయింపుల వివరాలు రెండ్రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉందని ద.మ.రైల్వే అధికారులు చెప్పారు.

ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే?

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లలో సింహభాగం.. ఎన్నికలు జరుగుతున్న ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌, గోవా తదితర రాష్ట్రాలకు వెళ్లే అవకాశం ఉందని.. తెలుగు రాష్ట్రాలకు ఈ ఏడాది రెండు, మూడుకి మించి దక్కకపోవచ్చని ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు.

డిమాండ్‌ చాలా ఉంది

సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం, విజయవాడ, పుణె, బెంగళూరు, చెన్నై, ముంబయి, తిరుపతి నగరాలకు వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ల డిమాండ్‌ ఎంతగానో ఉంది. ఈ మార్గాల్లో రైళ్లలో రిజర్వేషన్‌ దొరకడం చాలా కష్టం. శతాబ్ది రైళ్లకు మించి అత్యాధునికమైనవి వందే భారత్‌ రైళ్లు.. గంటకు 160 కి.మీ. గరిష్ఠ వేగం వీటి ప్రత్యేకత. ఇవి అందుబాటులోకి వస్తే నగరాల మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుంది. ముంబయి వైపు సింగిల్‌ లైన్‌, ట్రాక్‌ సామర్థ్యం 130 కి.మీ. లోపు ఉండటంతో వందేభారత్‌ రైలును సికింద్రాబాద్‌-ముంబయి మార్గంలో ప్రకటించడం కష్టమేనని ఓ నిపుణుడు అభిప్రాయపడ్డారు. తొలుత సికింద్రాబాద్‌-విశాఖపట్నం, సికింద్రాబాద్‌-తిరుపతి మార్గాల్లో వందేభారత్‌లు రావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

నిధుల్లో ప్రాధాన్యం దక్కేనా?

నిర్మాణం చివరిదశలో ఉన్న కొత్త లైన్లు, డబ్లింగ్‌ ప్రాజెక్టులకు ఈసారి గతేడాది కంటే గణనీయంగానే నిధులు పెంచారు. ఇలాంటివి రాష్ట్రంలో పెద్దగా లేవు. డబ్లింగ్‌(రెండో లైను) ప్రాజెక్టుల్లో సికింద్రాబాద్‌-మహబూబ్‌నగర్‌ మాత్రమే ఉంది. వరంగల్‌కి కోచ్‌ ఫ్యాక్టరీ డిమాండ్‌ బలంగా వినిపిస్తున్నా అది దక్కే అవకాశం లేదు. ఇప్పటికే మంజూరైన కాజీపేట ఓవర్‌ హాలింగ్‌ ప్రాజెక్టు నిధులు కేటాయింపునకు ఎదురుచూస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details