ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తోన్న కరోనా వైరస్ సగటు జీవిని ప్రాణభయంతో పరుగులు పెట్టిస్తోంది. అన్నమో రామచంద్రా అని అర్థించేలా చేస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ లలిత కళాతోరణం ఆవరణలో నాటకాలు ప్రదర్శిస్తూ జీవిస్తున్న సురభి కుటుంబాల కడుపులపై కరోనా దెబ్బకొట్టింది. శ్రీ వెంకటేశ్వర నాట్యమండలి పేరుతో గత 15 ఏళ్లుగా నాటకాలు వేస్తూ 12 కుటుంబాలు జీవించేవి. అందులో కొందరు లింగంపల్లిలోని సురభి కాలనీకి వెళ్లిపోగా మరికొంత మంది ఇక్కడే ఉండి జీవిస్తున్నారు. ఎప్పుడు కూలిపోతుందో తెలియని రేకుల షెడ్డు కింద ఇరుకుగదుల్లో జీవనం సాగిస్తున్నారు. నాటకం తప్ప మరే వ్యాపకం తెలియని ఈ కళాకారులు.. 100 మంది వచ్చినా... ఒక్కరు వచ్చినా నాటకాన్ని ప్రదర్శిస్తూ సురభి పేరును సుస్థిరం చేశారు. ఆ కళను మనదేశపు ఆస్తిగా మార్చారు.
ఎటూ కదల్లేని పరిస్థితి..
కానీ ఇప్పుడు పరిస్థితులు తారుమారయ్యాయి. సురభి కళాకారుల జీవనం అస్తవ్యస్తంగా మారింది. సాధారణ ప్రజలకు మార్చి నుంచి లాక్ డౌన్ మొదలైతే ఈ కళాకారుల కుటుంబాలకు మాత్రం ఫిబ్రవరి నుంచే మొదలైంది. నాటకాలు ప్రదర్శించే ప్రాంగణంలో గాలివానకు రేకులషెడ్డు కుప్పకూలింది. నాటకాల ప్రదర్శన ఆగిపోయింది. ఏం చేయాలో పాలుపోలేదు. మరోచోటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న తరుణంలో కరోనా వైరస్ కమ్ముకొచ్చింది. లాక్డౌన్తో ఎటూ కదల్లేని పరిస్థితుల్లో దేవుడిపై భారం వేసి కాలం వెళ్లదీస్తున్నారు.