తెలంగాణ

telangana

ETV Bharat / state

క్వారంటైన్​లో కరోనా... అనంతపురంలో కూలీల ఇక్కట్లు...! - అనంతపురంలో క్వారంటైన్ కేంద్రాలు

ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లాలో క్వారంటైన్ కేంద్రాల్లోని వలస కూలీలకు వైరస్ సోకటంతో ఆందోళన నెలకొంది. పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలను ఉంచిన కేంద్రాల్లో సరైన పర్యవేక్షణ లేదు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చిన వలస కూలీల ఆరోగ్య పరిస్థితులపై కనీస పర్యవేక్షణ కరవైంది. ముంబై నుంచి ప్రత్యేక రైలులో వలస కూలీలతో కలిసి వచ్చిన ఓ మహిళ వాంతులు, విరేచనాలతో బాధపడుతూ మృతిచెందింది. ఉరవకొండ క్వారంటైన్ కేంద్రంలో సౌకర్యాలు లేవంటూ, వలస కూలీలు గగ్గోలు పెడుతున్నా పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. నివాసాల మధ్య క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటును వ్యతిరేకిస్తూ పలు కాలనీల్లో రోడ్లమీదకు వస్తున్న ప్రజలను అదుపుచేయటం పోలీసులకు కత్తిమీద సాములా మారింది.

no-facilities-in-quarantine-centres-in-ananthapuram-district
క్వారంటైన్​లో కరోనా... అనంతపురంలో కూలీల ఇక్కట్లు...!

By

Published : May 11, 2020, 4:57 PM IST

ఆంధ్రప్రదేశ్​ అనంతపురం జిల్లాలో క్వారంటైన్ కేంద్రాల్లో వలస కూలీల బాధలు నరకాన్ని తలపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన జిల్లాకు చెందిన కూలీలకు ఆయా రాష్ట్రాల్లో వైద్య పరీక్షలు చేయకపోవటంతో ఇక్కడ పాజిటివ్​గా నిర్ధరణ అవుతోంది. ఈ నెల 7వ తేదీన ముంబై నుంచి గుంతకల్లుకు వచ్చిన ప్రత్యేక రైలు అనంతపురం, కర్నూలు, బళ్లారిలకు చెందిన 968 మంది వలస కూలీలను తీసుకొచ్చింది. వీరిని విడపనకల్లు, ఉరవకొండ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచారు. వీరిలో తాజాగా ఇద్దరికి వైరస్ పాజిటివ్​గా గుర్తించారు. దీంతో రైలులో కలిసి వచ్చిన వందలాది మంది ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం మన వలస కూలీలను వదిలించుకునే ప్రయత్నంలోనే, వారికి కనీసం వైద్య పరీక్షలు కూడా చేయకుండా రైలు ఎక్కించారనే విమర్శలున్నాయి.

ఆది నుంచి విమర్శలే

క్వారంటైన్ కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేవంటూ ఆది నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిధుల లేమి కారణంగా కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోతున్నట్లు కొందరు అధికారులే చెప్తున్న పరిస్థితి ఉంది. ఉరవకొండ క్వారంటైన్​లో ఉన్న వలస కూలీల అవస్థలు చూసి దాతలు బక్కెట్లు, మగ్గులు ఇచ్చారు. మంత్రి శంకరనారాయణ ఉరవకొండ కేంద్రాన్ని పరిశీలించినపుడు అక్కడి వలస కూలీలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస సౌకర్యాలు లేవని, దుప్పట్లు కూడా ఇవ్వటంలేదని మంత్రికి ఫిర్యాదు చేశారు. విడపనకల్లు ఆదర్శ పాఠశాల క్వారంటైన్ కేంద్రంలో ముంబై నుంచి వచ్చిన వలస కూలీ మహిళ చావుకు వైద్యుడు రాకపోవటమే కారణమని, ఆమెతో ఉన్న వలస కూలీలు మంత్రికి చెప్పారు. దీంతో ఆ వైద్యుడిని సస్పెండ్ చేయాలని మంత్రి శంకరనారాయణ, కలెక్టర్ గంధం చంద్రుడిని ఆదేశించారు. జిల్లాలో 27 క్వారంటైన్ కేంద్రాలుండగా, పలుచోట్ల వైద్యులు విధులకే హాజరు కావటం లేదని ఆరోపిస్తున్నారు.

ఇక్కడ వద్దు

జనావాసాల మధ్య క్వారంటైన్ కేంద్రాల ఏర్పాటును స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గ్రీన్, ఆరంజ్ జోన్లుగా ఉన్న తమ కాలనీల్లో వైరస్ వ్యాప్తి చేస్తారా అంటూ పోలీసులను, అధికారులను నిలదీస్తున్నారు. హిందూపురం పట్టణంలోని ప్రార్థనా మందిరాల్లో ఉన్న 126 మందిని గుర్తించి క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. వారిని అనంతపురం నగరానికి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ఉంచగా.. 27 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయింది. వీరంతా తమ జిల్లాకు చెందిన వారు కాదని గుజరాత్ వారని రోగుల జాబితాలో ఇతరులుగా చూపిస్తున్నారన్నారు. అయితే నెల రోజులపాటు అందరూ కలిసి ఉన్నందున మిగిలిన వారికీ వైరస్ సోకే అవకాశం ఉందని వైద్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

రైళ్లు సరిపోవడంలేదు

అనంతపురం నుంచి పశ్చిమబంగకు వలస కూలీలను తరలించటానికి ప్రత్యేక రైలు ఏర్పాటు చేశారు. ఈ రైలు 24 గంటలుగా అనంతపురం రైల్వే స్టేషన్​లోనే ఉంది. వెళ్లాల్సిన వారు 1463 మంది ఉండగా, రైలులో కేవలం 12 వందల మందికి మాత్రమే సీట్లు ఉన్నాయని రైల్వేశాఖ చెబుతోంది. మరోవైపు వీరిని పంపటానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటానికి మరో 3 రోజులు పట్టే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

జిల్లా వ్యాప్తంగా ఉన్న క్వారంటైన్ కేంద్రాల్లో భద్రత పెంచటంతోపాటు, నిరంతరం వైద్యులు, నర్సులను అందుబాటులో ఉంచాల్సిన అవసరం ఉంది. ఈ కేంద్రాల్లో ఉన్నవారంతా వలస కూలీలు కావటంతో వారికి ఎలాంటి అనారోగ్యం ఉందో, ఎప్పుడు ఏ సమస్య వస్తుందోనని కొందరు వైద్య సిబ్బందే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details