No Drinking Water In Railway Stations: పేదల ప్రయాణ అవసరాలను తక్కువ ధరల్లోనే తీర్చే రైల్వేస్టేషన్లలో ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. ప్రతి ప్లాట్‌ఫామ్‌పై తక్కువ ధరకే తాగునీరు అందించే ఐఆర్‌సీటీసీ ‘స్వజల్’ ఆర్‌వో ప్లాంట్‌లు మూతపడటం వల్ల జనం దాహార్తితో అలమటిస్తున్నారు. బయటి దుకాణాల్లో లీటరు నీళ్ల సీసాకు పది రూపాయలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. స్వజల్ ప్లాంట్‌లో లీటర్ బాటిల్ ఐదు రూపాయలకే అందించేవారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అన్ని స్టేషన్లలోనూ తాగునీరు కరవైంది.
మూతపడిన రైల్వే 'స్వజల్' ఆర్వో ఫ్లాంట్‌లు.. దాహార్తితో అలమటిస్తున్న ప్రయాణికులు - సికింద్రాబాద్ రైల్వే స్టేషన్
సాధారణ ప్రయాణికులకు సంజీవనిలా ఉపయోగపడే రైల్వేస్టేషన్లలో సేవలు ప్రియం అయ్యాయి. సామాన్యులకు తిందామంటే తిండి దొరకదు. దాహమేస్తే తాగు నీరు లభించదు. ఐఆర్‌సీటీసీ నడిపించే ‘జనాహార్’ హోటళ్లు బంద్ కావడంతో ఫుడ్‌కోర్టులకు వెళ్లలేక.. ఆకలితోనే ప్రయాణించాల్సిన దుస్థితి. కరోనా కాలంలో దక్షిణమధ్య రైల్వే పరిధిలో మూతపడిన క్యాంటీన్లను తర్వాత తెరిచినా.. వాటి కాలపరిమితి అయిపోయిందంటూ కొన్ని స్టేషన్లలో మూసేశారు.
సికింద్రాబాద్ స్టేషన్ పేరుకే ఏ1 స్టేషన్‌గా గుర్తింపు పొందింది. కరోనా సాకుతో ‘జనాహార్’ క్యాంటిన్ బంద్ అయి మూడేళ్లయ్యింది. ఫుడ్ ట్రాక్ సామాన్యుడి జేబు గుల్ల చేస్తున్నాయి. విజయవాడలోనూ స్టేషన్ అభివృద్ధి పనుల పేరుతో 6, 7 ప్లాట్‌ఫామ్‌లపై ఉన్న క్యాంటీన్లను మూసేసారు. ఈస్ట్ కోస్టు పరిధిలో ఉన్న విశాఖపట్నం రైల్వే స్టేషన్‌లో జనాహార్ క్యాంటిన్ నడుస్తోంది. ఇందులో 20 రూపాయలకే జనతాఖానా దొరుకుతుంది. అందరికీ అందుబాటులో 20 రకాల ఆహారాలను అందిస్తున్నారు. ఇలాంటి వాతావరణం సికింద్రాబాద్ స్టేషన్లో ఎందుకు లేదని ప్రయాణికులు వాపోతున్నారు. రైల్వే అధికారులకు సామాన్య ప్రయాణికుల గోడు ఎందుకు పట్టడంలేదని ఆరోపిస్తున్నారు. వ్యాపార ధోరణి తప్ప..సేవామార్గం రైల్వేలో కనిపించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి:అక్షరాలా రూ. లక్ష కోట్లు.. ఇదీ రాష్ట్రంలో స్థిరాస్తి లావాదేవీల విలువ!