ఔటర్ రింగ్ రోడ్డు వెంట ఇరు వైపులా ఉన్న 15 మీటర్ల బఫర్ జోన్ ఏరియా ఎలాంటి తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ స్పష్టం చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు బఫర్ జోన్లో కేవలం గ్రీనరీ పెంపకానికి మాత్రమే అనుమతి ఉందని వెల్లడించింది. హెచ్ఎండీఏ, ఔటర్ రింగ్ రోడ్డు హైదరాబాద్ గ్రోత్ కారిడార్ ఉన్నతాధికారులతో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ అర్వింద్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఓఆర్ఆర్ ప్రాజెక్టుకు భూసేకరణ చేయని ప్రైవేటు భూ యజమానులు ఓఆర్ఆర్ వెంట కచ్చితంగా బఫర్ జోన్ నిబంధనలను పాటించాల్సిందేనని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్ స్పష్టం చేశారు. బఫర్ జోన్ వెంట భవన నిర్మాణ అనుమతులు ఇచ్చే సందర్భంలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు 15 మీటర్ల సెట్ బ్యాక్ నిబంధనలను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.