No Confidence Motion in TS Municipalities: రాష్ట్రంలోని పలు పురపాలికల్లో అవిశ్వాస తీర్మానాలు అధికార పార్టీలో అలజడి రేపుతోంది. పాలకవర్గాలు కొలువుదీరి మూడేళ్లు పూర్తవుతున్న వేళ ఇదే అదునుగా భావిస్తున్న కౌన్సిలర్లు.. తమ డిమాండ్లు సాధించుకోవడంపై దృష్టిపెట్టారు. 2020 జనవరి 27న కొలువుదీరిన పాలక వర్గాల మూడేళ్ల కాలపరిమితి ఇవాళ్టితో ముగియనుండటంతో.. ఛైర్‌పర్సన్ పదవులపై నాడు ఇచ్చిన హామీల అమలుకు ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను పట్టుబడుతున్నారు. ఆ దిశగా స్పష్టత లభించని ఆశావహులు అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్నారు.
2020లో పాలకవర్గాలు కొలువుదీరిన సమయంలో కొన్ని పురపాలక సంఘాల్లో ఛైర్‌పర్సన్ స్థానాల కోసం పలువురు పోటీపడ్డారు. అంతర్గత సమస్యలకు తావులేకుండా చూసేందుకు.. మూడేళ్ల తర్వాత ఛైర్‌పర్సన్‌గా అవకాశం కల్పిస్తామని అప్పట్లో స్థానిక ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీలను అమలు చేయాలని పట్టుబడుతున్న ఆశావహులైన కౌన్సిలర్లు.. మిగిలిన రెండేళ్ల కాలానికైనా తమకు అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు.
ఛైర్‌పర్సన్ల ముందుకు పలు డిమాండ్లు:ఎన్నికై మూడేళ్లయినా ఆశించిన మేర ఆర్థికంగా ప్రయోజనం కలగలేదని పలు చోట్ల కౌన్సిలర్లు అసంతృప్తితో ఉన్నారు. ఉప ఎన్నికలు జరిగిన నియోజకవర్గాల్లో కొంతమందికి లబ్ధి చేకూరినా.. మిగిలిన చోట్ల ఇదే పరిస్థితి ఉంది. పనులు జరుగుతున్నా, పట్టణ ప్రగతి నిధులు అందుబాటులోకి వస్తున్నా.. ఆర్థిక ప్రయోజనాలు కొందరికి మాత్రమే ఉంటున్నాయని వారు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పలు డిమాండ్లను ఛైర్‌పర్సన్ల ముందుంచుతున్నారు.
జగిత్యాలలో విభేదాల కారణంగా ఛైర్‌పర్సన్ రాజీనామా: మూడేళ్ల పదవీకాలం పూర్తైన తరుణంలోనే.. జగిత్యాలలో విభేదాల కారణంగా ఛైర్‌పర్సన్ రాజీనామా చేసిన ఘటన స్థానికంగా రాజకీయ వేడిని రాజేసింది. ఇదే తరహాలో జనగామలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు 11 మంది ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నారు. ఆర్మూర్‌లో కౌన్సిలర్లలో అసంతృప్తి చెలరేగగా.. ఇప్పటికైతే సద్దుమణిగేలా చేశారు. హుజూరాబాద్ సహా పలుచోట్ల నేతల మధ్య అంతరం కొనసాగుతోంది.
అప్రమత్తమైన ఆయా పార్టీలు: ఒకపక్క అవిశ్వాసంపై చర్చలు జరుగుతుండగా.. మరో వైపు అధికారంలో ఉన్న పార్టీ నేతలు.. ఇతర పార్టీల కౌన్సిలర్లపై దృష్టి సారించడంతో ఆయా పార్టీలు అప్రమత్తమయ్యాయి. ఛైర్‌పర్సన్ ఆశావహులు సొంత పార్టీ కౌన్సిలర్లతో పాటు ఇతర పార్టీలవారినీ సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే క్యాంపుల నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. జనగామ పురపాలికకు చెందిన 11 మంది కౌన్సిలర్లు క్యాంపులో ఉండగా, కాంగ్రెస్ కౌన్సిలర్లు 8 మంది క్యాంపునకు చేరినట్లు తెలిసింది.