Farmer Producers Organization: సన్న, చిన్నకారు రైతులను సంఘటితం చేసి పంటలపై ఆదాయం రెట్టింపు చేసేందుకు ఉద్దేశించిన ‘రైతు ఉత్పత్తిదారుల సంఘాల’ (ఫార్మర్ ప్రొడ్యూసర్స్ ఆర్గనైజేషన్-ఎఫ్‌పీవో) ఏర్పాటుపై శ్రద్ధ కరవైంది. దేశవ్యాప్తంగా 2020-23కల్లా 10 వేల సంఘాలను ఏర్పాటు చేయాలని కేంద్రం లక్ష్యంగా నిర్దేశించింది. తెలంగాణలో గత రెండేళ్ల (2020-22)లో కేవలం 142 సంఘాలు మాత్రమే కొత్తగా ఏర్పాటైనట్లు కేంద్ర వ్యవసాయశాఖ తాజా నివేదికలో వెల్లడించింది.
నాబార్డు ద్వారా ఈ సంఘాలను ఏర్పాటు చేస్తున్నారు. కానీ రైతులకు చేరువగా ఉండే వ్యవసాయ, ఉద్యాన, మార్కెటింగ్ అధికారులు ఈ సంఘాల ఏర్పాటుపై రైతులకు ఏమీ చెప్పలేకపోతున్నారు. దేశవ్యాప్తంగా ఇంకా 1,469 రెవెన్యూ బ్లాకుల పరిధిలో ఎఫ్‌పీవోలు ఏర్పాటు చేయాల్సి ఉందని, వీటిలో 372 తెలంగాణలోనే ఉన్నట్లు స్పష్టం చేసింది. రాష్ట్రంలో కనీసం మండలానికొక సంఘం కూడా ఏర్పాటుకాలేదు.
జిల్లాల వారీగా ఏయే మండలాల్లో ఈ సంఘాలు ఏర్పాటు కాలేదనే వివరాలు ‘భారత చిన్న రైతుల వ్యవసాయ వాణిజ్య సమాఖ్య’ వెల్లడించింది. సభ్యులుగా ఉన్న రైతులు పండించే పంటలకు అధికధరలు రాబట్టి ఆదాయం పెంచుకోవడానికి ‘జాతీయ కమోడిటీ అండ్ డెరివేటివ్ ఎక్స్ఛేంజి’ (ఎన్‌సీడీఎక్స్) ద్వారా సంఘాలు విక్రయిస్తున్నాయి. ఈ ఎక్స్ఛేంజిలో దేశవ్యాప్తంగా 470 ఎఫ్‌పీవోలు పలురకాల పంటలను విక్రయిస్తుండగా వీటిలో తెలంగాణ నుంచి 18 మాత్రమే ఉన్నాయి.
ఎఫ్‌పీవోలతో ఇవీ ప్రయోజనాలు:ఒక ప్రాంతంలో వ్యవసాయం చేసే రైతులు కనీసం 11 మంది కంపెనీల చట్టం కింద ఎఫ్‌పీవోను ఏర్పాటు చేసుకుంటే దాని స్థాపిత వ్యయం కింద మూడేళ్లలో రూ.18 లక్షలను కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా ఇస్తుంది. సభ్యులకు ‘ఈక్విటీ గ్రాంటు’ పేరుతో ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున గరిష్ఠంగా మరో రూ.15 లక్షలు నాబార్డు ద్వారా అందజేస్తుంది.