MP Arvind Comments on MLC Kavita in Delhi Liquor Scam: దిల్లీ మద్యం కుంభకోణంలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ కావడం ఖాయమని, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ కుమార్ అభిప్రాయపడ్డారు. కొద్దిరోజుల్లో కవిత తీహార్ జైలుకు వెళ్తుందని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకొని వెళ్తుందన్న అయన... అందులో భాగంగా మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేశారని వివరించారు. ప్రజాగోస, బీజేపీ భరోసా పేరిట హైదరాబాద్ వినయ్‌నగర్‌లో నిర్వహించిన కార్నర్ సమావేశంలో అర్వింద్ కుమార్ పాల్గొన్నారు.
MP Arvind Comments on MLC Kavita: దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా అరెస్ట్‌ను బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది. కేంద్రంలోని బీజేపీ సర్కారు విపక్షాలపై అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. దర్యాప్తు సంస్థల్ని ఉసిగొలిపి దొంగచాటు రాజకీయాలను చేస్తోందని మంత్రి విమర్శించారు.
ప్రజాబలం లేక.. అధికారంలోకి రాలేని ప్రాంతాల్లో, అక్కడి పార్టీలను బలహీనపరుస్తోందన్నారు. ఇందులో భాగంగానే సిసోదియాను అరెస్ట్ చేశారని మంత్రి కేటీఆర్ దుయ్యబట్టారు. దిల్లీ మేయర్ ఎన్నికపై సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టడాన్ని తట్టుకోలేకే మనీశ్ సిసోదియాను అరెస్ట్ చేశారని ఆక్షేపించారు. ఇప్పటికే దేశంలోని 9 రాష్ట్రాల ప్రభుత్వాలను కూల్చిన అప్రజాస్వామిక పార్టీ బీజేపీనేనని మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.