రానున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మంత్రి కేటీర్‌ను తెరాస అభ్యర్థిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసేందుకు ఈ ఉప ఎన్నికలు వచ్చాయని దుయ్యబట్టారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ఏర్పాటు చేసిన భాజపా నాయకులు, కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓటమి భయం పట్టుకుందని అర్వింద్ విమర్శించారు. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత తెరాస ప్రభుత్వానికి పతనం ప్రారంభమైందన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల తర్వాత తెరాస పేకమేడలా కూలిపోతుందని ఎద్దేవా చేశారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రి చేసేందుకు ఈటల అడ్డుపడుతున్నాడని.. ఆ అక్కసుతోనే ఈటలను పక్కకుపెట్టారని ఆరోపించారు. కేటీఆర్ రాజకీయ భవిష్యత్తు కోసమే ఈటలకు అన్యాయం చేశారన్నారు. ఎన్ని చేసినా కేటీఆర్ ముఖ్యమంత్రి కావటం కలగానే మిగులుతుందని అన్నారు.