తెలంగాణ

telangana

ETV Bharat / state

Bandenka Bandi Katti : బండెనక బండికట్టి...నైజాం సర్కారు గుండెల్లో రైళ్లు - తెలంగాణ విమోచనోద్యమం

Bandenka Bandi Katti : విప్లవాలు, ఉద్యమాలలో కళా, సాంస్కృతిక రంగాలదీ ప్రధాన భూమికే . ఉద్యమాలకు అండగా నిలిచి తమ పదునైన కవితలతో, రక్తాన్ని మరిగించే కళారూపాలతో కవులు, కళాకారులు ఉర్రూతలూగించిన సందర్భాలు కోకొల్లలు. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాల్లో వీరి పాత్ర కనిపిస్తుంది. ఒక పాట, ఒక నినాదం....మొత్తం ఉద్యమగతినే మార్చిన సందర్భాలెన్నో. వందేమాతరం, ఇంక్విలాబ్ జిందాబాద్‌ నినాదాలు స్వాతంత్ర్యోద్యమానికి దిక్సూచిగా మారితే... తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంటో బండెనక బండికట్టి లాంటి గేయాలు.....నిజాంపై నిప్పుల వాన కురిపించాయి.

Nizam rule ended
బండెనక బండికట్టి

By

Published : Sep 16, 2022, 6:13 PM IST

తెలంగాణ విమోచనోద్యమంలో పోరాట వీరులు నిజాంపై ఆయుధాలను ఎక్కుపెడితే, కవులు, కళాకారులు తమ కలాలనే ఆయుధాలుగా మార్చుకున్నారు. చుర కత్తుల్లాంటి పాటలు, గేయాలతో ప్రజల్లో విప్లవాగ్నిని రగిలించారు. కవిత్వం, కథ, పాట, నాటకం నాటిక ఇలా అన్ని సాహిత్య ప్రక్రియలతోనూ ఉద్యమానికి ఊపిరులూదారు. బుర్రకథ, హరికథ, ఒగ్గుకథ, వీధి భాగవతం, బుడబుక్కలకథ లాంటి రూపకాలతో జనాన్ని కదిలించారు. నవలా ప్రక్రియలోనూ జనజీవితాన్ని ప్రతిబింబించారు. మా నిజాము రాజు తరతరాల బూజు అంటూ దాశరధి చేసిన కవితా సింహనాదం జనం గుండెల్లో ప్రతిధ్వనించింది. అలా కవులు, అటు కళాకారుల తెలంగాణ సాయుధ పోరాటానికి తమవంతుగా సమిధలను అందించారు. గ్రామానికో కవి, ఇంటికో కళకారుడన్నట్లు చదువు, సంధ్యలు లేనివారు కూడా పాటలు కట్టి ఉద్యమాన్ని ఉర్రూతలూగించారు. బండెన బండికట్టి పదహారు బండ్లు కట్టి అనే గేయం రాసింది నిరక్షరాస్యుడైన యాదగిరి. ఈ పాట నైజాం సర్కారు గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.

బండెనక బండికట్టి

దేశ్‌ముఖ్‌లు, జమీందారులకు వెట్టి చాకిరి చేస్తూ.....పసిమొగ్గలు సైతం వాడిపోతున్న వైనాన్ని, బాల కార్మికుల కష్టాలను కళ్లకు కడుతూ.... పల్లెటూరి పిల్లగాడా, పసులగాసే పోరగాడ అంటూ సుద్దాల హన్మంతు రాసిన గీతం....నాడు అందరి నోళ్లలో నానింది. ఉర్దూ, హిందీ, తెలుగులో ఎన్నో గీతాలు ఉద్యమానికి బాసటగా నిలిచాయి.

బండెనక బండికట్టి

నాటి తెలంగాణ ప్రజల కష్టాలకు అద్దం పట్టింది...మా భూమి నాటకం. సుంకర, వాసిరెడ్డి కలిసి రచించిన ఈ నాటకం ఉద్యమ కాలంలో కొన్నివేలసార్లు ప్రదర్శనకు నోచుకుంది. ఈ నాటకంలో దొర వేషం వేసిన పాత్రధారిని ఆవేశంలో ప్రజలు నిజంగానే చితబాదిన సందర్భాలు కూడా ఉన్నాయి.

బండెనక బండికట్టి

తెలంగాణ ఉద్యమకాలంలో ప్రముఖ నవలా రచయిత వట్టికోట అళ్వారుస్వామి రచించిన ప్రజల మనిషి రచన నిజాం రాజ్యంలోనూ, ఇటు దేశంలోనూ నెలకొన్న పరిస్థితులకు అక్షర రూపం. దాశరధి, కాళోజీలు తమ రచనలతో ఉద్యమానికి మరింత ఊపునిచ్చారు. ఒగ్గుకథ, బుర్రకథ, హరికథ....ఇలా జన సామాన్యంలోకి చొచ్చుకుపోయే ప్రతి కళ తనవంతుగా సాయుధ పోరుకు అండగా నిలబడింది.

60 ఏళ్ల తెలంగాణ సాయుధ పోరాటంలో విప్లవ గేయాలతో ప్రజల్లో స్పూర్తి రగిలించిన పాటలు ఎన్నో. ఇప్పుడు విన్నా...ఆ పాటలు, కథలు అదే తరహా ఉద్రేకాన్ని, ఉద్వేగాన్ని కలిగిస్తాయి. దశాబ్దాలు గడిచినా...నాటి గాయాలు....గేయాలై నేటికీ తెలంగాణ గడ్డపై వినిపిస్తూనే ఉంటాయి.

బండెనక బండికట్టి

ఇదీ చూడండి.

1.ప్రతి పల్లె... తెలంగాణ జలియన్‌ వాలాబాగే...! వందలాది భగత్‌సింగ్‌లు, చెగువేరాలు

2.Veera Bairanpally revolt : రజాకార్ల రాక్షసత్వాన్ని ఎదురించిన వీరభూమి బైరాన్‌పల్లి

3.తెలంగాణ విముక్తి బాటకు దశా- దిశ ఆంధ్రమహాసభ

ABOUT THE AUTHOR

...view details