Nizam College Students Protest Updates: హైదరాబాద్ నిజాం కళాశాల యూజీ విద్యార్థులు తమకు హాస్టల్ కేటాయించాలని ఆందోళను చేస్తున్న విషయం తెలిసిందే. వారు చేస్తున్న నిరసనకు పలువురు రాజకీయ, విద్యార్థి సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. 130 ఏళ్ల చరిత్ర గల కళాశాలలో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బంది రావడం బాధాకరమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. విద్యార్థులకు వెంటనే హాస్టల్ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అన్నీ యూనివర్శిటీల విద్యార్థులు ఉద్యమం చేస్తేనే.. తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని కేసీఆర్ గుర్తుచేసుకోవాలని ప్రవీణ్ కుమార్ హితవు పలికారు. విద్యార్థులకు కొత్తగా మరో హాస్టల్‌ను నిర్మించడానికి రూ.5కోట్లు ఖర్చు అవుతోందని.. ప్రభుత్వం రూ.5 కోట్లు కేటాయించలేని పరిస్థితిలో ఉందా అని ప్రశ్నించారు. కానీ ప్రగతిభవన్ కట్టడానికి రూ.177 కోట్లు ఖర్చు పెట్టారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.
ఆ పది కోట్లతోనే రెండు హాస్టల్స్‌ను నిర్మించవచ్చు: ప్రభుత్వం నూతన సచివాలయం కోసం రూ.1200 కోట్లకు పైగా ఖర్చు పెడుతుందని ప్రవీణ్ కుమార్ తెలిపారు. మంత్రి కేటీఆర్ దావోస్ పర్యటన కోసం రూ.10 కోట్లు ఖర్చు పెట్టారని.. ఆ పది కోట్లతోనే రెండు హాస్టల్స్‌ను నిర్మించవచ్చని అన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొత్తగా కట్టిన హాస్టల్‌ను యూజీ విద్యార్థులకు కేటాయించాలని.. అదేవిధంగా మరో కొత్త హాస్టల్‌ను నిర్మించి పీజీ విద్యార్థులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకూ కళాశాలలోనే విద్యార్థులు శాంతియుతంగా నిరసన తెలపాలని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు .
మరోవైపు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వ్యవస్థాపకురాలు విమలక్క, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ విద్యార్థుల నిరసనకు సంఘీభావం తెలిపారు. ఈ విషయంపై బయట పోరాటాన్ని తాము ఉద్ధృతం చేస్తామని విద్యార్థి సంఘాల నాయకులు వారికి భరోసా ఇచ్చారు.