Nizam College Students Protest: హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని నిజాం కళాశాలలో ప్రిన్సిపల్ ఛాంబర్ కార్యాలయంలో విద్యార్థుల బైఠాయింపు ఉద్రిక్తంగా మారింది. నిజాం కాలేజీలో నూతనంగా నిర్మించిన మహిళా హాస్టల్‌ను అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థులకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ.. విద్యార్థినులు ప్రిన్సిపల్‌తో వాగ్వాదానికి దిగారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి చదువుతున్న విద్యార్థినులకు హాస్టల్ సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు.
అయిదు రోజులు సమయం ఇవ్వాలని చెప్పిన ప్రిన్సిపల్.. దొంగచాటుగా పీజీ విద్యార్థినులకు కేటాయించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని ప్రిన్సిపల్ కార్యాలయంలో బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు అడ్డుకోవటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తమకు హాస్టల్ వసతి కేటాయించే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని విద్యార్థులు స్పష్టం చేశారు.