తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ లేఖ రాశారు. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టెయినబుల్ ట్రాన్స్ఫర్మేషన్ (జీఎఫ్‌ఎస్‌టీ)తరఫున విలువైన సూచనలతో నివేదిక అందించారని ప్రశంసించారు. ఏప్రిల్ 19న ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖపై రాజీవ్ కుమార్ స్పందించారు. 'లాక్‌డౌన్ సమర్థ నిర్వహణలో కొత్త సంస్థాగత విధానానికి శ్రీకారం చుట్టారు. విశ్లేషణలతో డేటా ఆధారిత విధానాన్ని అవలంబించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేసింది. కరోనా సంక్రమణ, వ్యాప్తి, ఉనికిని గుర్తించడం కోసం సాంకేతిక పరిష్కారాలు ఏర్పాటు చేస్తోంది. ఎమర్జింగ్ హాట్‌స్పాట్లు, ఆరోగ్యాన్ని బ్యాలెన్స్ చేసే చర్యలను కేంద్రం చేపట్టింది. కొవిడ్-19కి సంబంధించి మీ అధ్యయనాలు పరిశీలించాలని సహోద్యోగులకు సూచించా. డేటా సేకరణ, ఆర్టీజీతో ఏకీకృత డ్యాష్ బోర్డు ఏర్పాటు వంటి ముఖ్యమైన సూచనలు చేశారు మీరు. నీతి ఆయోగ్ బృందం మీ రీసెర్చ్ బృందాన్ని త్వరలోనే సంప్రదిస్తుంది. మీ చొరవ, విలువైన మద్దతుకు కృతజ్ఞతలు. వివిధ స్థాయిల్లో చేసిన ప్రయత్నాలతో గొప్ప నివేదిక అందించారు' అని రాజీవ్‌కుమార్ లేఖలో పేర్కొన్నారు.
చంద్రబాబుపై నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ ప్రశంసలు - చంద్రబాబుకు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ లేఖ
తెదేపా అధినేత చంద్రబాబుకు నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఏప్రిల్ 19న ప్రధానికి చంద్రబాబు రాసిన లేఖకు స్పందించిన ఆయన విలువైన సూచనలతో నివేదిక అందించారని ప్రశంసించారు. నీతి ఆయోగ్ బృందం త్వరలో మీ రీసెర్చ్ బృందాన్ని సంప్రదిస్తుందని లేఖ పంపారు.
అదే సరైన మార్గం
నీతి ఆయోగ్ వైస్ ఛైర్మన్ రాజీవ్ కుమార్ లేఖకు చంద్రబాబు స్పందించారు. 'మా లోతైన హాట్‌స్పాట్ మోడలింగ్‌ను నీతి ఆయోగ్ వీసీ రాజీవ్ కుమార్ గుర్తించటం సంతోషకరం. గ్లోబల్ ఫోరం ఫర్ సస్టైనబుల్ ట్రాన్స్ఫర్మేషన్ కొవిడ్-19 సంక్షోభాన్ని పరిష్కరించడంలో భారతదేశం చేస్తున్న ప్రయత్నాలను పెంచుతుంది. ప్రపంచంలోని అత్యుత్తమ విధానాలపై వ్యూహంతో పనిచేయటం ఉత్తమం. కరోనాకి వ్యతిరేకంగా భారతదేశం చేసే పోరాటానికి జీఎఫ్‌ఎస్‌టీ అనుసరించే మార్గం ఇదే' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.