Niti Aayog recognition for palle prakruthi vanam: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రకృతి వనాలకు నీతి ఆయోగ్ గుర్తింపు లభించింది. 2023 సంవత్సరానికి సామాజిక రంగంలో నీతిఆయోగ్ ప్రకటించిన 75 ఉత్తమ విధానాల్లో పల్లె ప్రకృతి వనాలకు స్థానం దక్కింది. పర్యావరణ విభాగంలో చోటు లభించగా.. పల్లె ప్రకృతి వనాలతో జీవ వైవిధ్యం పెరిగిందని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది.
వనాలు పక్షులు, పురుగులు, సీతాకాకచిలుకలకు ఆవాసాలుగా మారాయని.. ఏడాది కాలంలోనే స్థానిక ఫ్లోరా, ఫోనా బాగా పెరిగిందని పేర్కొంది. తక్కువ విస్తీర్ణంలో దట్టంగా మొక్కలు నాటడం వల్ల కార్బన్ ఫిక్సేషన్తో పాటు భూమిలోనూ కార్బన్ నిల్వలు పెరిగాయని నీతి ఆయోగ్ తెలిపింది. దట్టమైన వనాల నుంచి వర్షపు నీరు బయటకు వెళ్లే అవకాశం లేదని, భూమిలోకే పూర్తిగా ఇంకుతోందని... తద్వారా భూమి, నీటి పరిరక్షణ చర్యలకు తోడ్పడుతున్నాయని పేర్కొంది.
చెక్ డ్యాంలు, పర్కొలేషన్ ట్యాంకుల కంటే ఉత్తమ బయో హార్వెస్టింగ్ నిర్మాణాలుగా పల్లె ప్రకృతి వనాలు మారాయని నీతి ఆయోగ్ అభిప్రాయపడింది. ఐదు నుంచి పదెకరాల విస్తీర్ణంలో బృహత్ ప్రకృతి వనాలను కూడా తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి చేస్తోందని.. 545 మండలాల్లో 2725 వనాలు ప్రతిపాదించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది.
ఇంధన పొదుపులోనూ.. తెలంగాణను నీతి ఆయోగ్ ప్రశంసించింది. ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ నిర్ణయం అమలు తీరును కొనియాడింది. గత మూడేళ్లలో 336 మెగావాట్ల విద్యుత్తు ఆదా చేసినట్లు తెలంగాణ రాష్ట్ర పునరుత్పాదక శక్తి అభివృద్ధి సంస్థ చైర్మన్ సతీష్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్ తో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి మార్గదర్శిగా నిలుస్తోందన్నారు.
Green Building Award to TS Secretariat: తెలంగాణ నూతన సచివాలయ భవనానికి ప్రతిష్ఠాత్మక గ్రీన్ బిల్డింగ్ అవార్డు లభించింది. భారతదేశంలోనే మొట్టమొదటి గోల్డ్ రేటెడ్ సెక్రటేరియెట్ బిల్డింగ్ కాంప్లెక్స్‌గా ఈ బిల్డింగ్ రికార్డుల్లోకెక్కింది. ఈ మేరకు రహదార్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ వారు అవార్డు ప్రధానం చేశారు.
గోల్డ్ రేటింగ్ ఎలా ఇస్తారంటే..:భవనంలోకి సహజ సిద్ధమైన గాలి, వెలుతురు పుష్కలంగా వచ్చేలా నిర్మాణ శైలి ఉండాలి. నిర్మాణంలో హరిత ప్రమాణాలను పాటించినట్లు ఆయా సంస్థలు ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్‌కు దరఖాస్తు చేసుకోవాలి. అవి అలా ప్రమాణాలను పాటించాయో లేదో గుర్తించేందుకు ఎంపిక చేసిన నిపుణులతో ఒక కౌన్సిల్ ఉంటుంది. ఆ నిపుణుల బృందం నిర్మాణాన్ని పరిశీలించి నిర్మాణ తీరు తెన్నులు తెలుసుకుంటుంది. ఐజీబీసీ ప్రమాణాల మేరకు నిర్మాణం జరిగినట్లు తేలితే అప్పుడు గోల్డ్ రేటింగ్ ప్రకటిస్తుంది.
ఇవీ చదవండి: