ఆంధ్రపదేశ్‌లోని కడప జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో నివర్ తుఫాన్ ప్రభావం కొనసాగుతుంది. తిరుపతి ప్రధాన రహదారి కుక్కలదొడ్డి సమీపంలో కొండలపై నుంచి వర్షపు నీరు.. ప్రధాన రహదారిపైకి రావటంతో రోడ్డు కోతకు గురై.. తిరుపతి, కడప వెళ్లవలసిన వాహనాలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. జిల్లా అంతటా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తుఫాన్ ప్రభావం వలన చెరువులు నిండుకుండలను తలపించటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే పండ్ల తోటల రైతులు మాత్రం ఆందోళనకు గురవుతున్నారు.
కడపను వణికిస్తున్న నివర్ తుఫాన్... కోతకు గురైన తిరుపతి రహదారి - కడపలో వర్షాలకు కూలిన చెట్టు తాజా వార్తలు
ఏపీలోని కడప జిల్లా వ్యాప్తంగా నివర్ తుపాన్ ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాజెక్టులు పొంగి పొర్లుతుండగా.. రహదారులపైకి భారీ నీరు చేరింది. ఇళ్లల్లోకి వరద నీరు చేరటంతో అధికారులు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
జిల్లా వ్యాప్తంగా రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బద్వేలులోని భగత్ సింగ్ కాలనీ నీట మునిగింది. నాగుల చెరువు నుంచి భారీగా వరద నీరు కాలనీని చుట్టుముట్టింది. దీంతో 257 ఇల్లు నీట మునగడంతో స్థానికులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఆర్టీసీ గ్యారేజ్‌లోకి వర్షపు నీరు చేరటంతో.. బస్సుల మరమ్మత్తులు నిలిచిపోయాయి. రహదారులన్నీ జలమయమవ్వటం.. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.
జమ్మలమడుగు నియోజకవర్గంలోని జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం, ముద్దనూరు, కొండాపురం, ఎర్రగుంట్ల మండలాల్లో తెల్లవారుజామున మూడు గంటల నుంచి జోరుగా వాన కురుస్తోంది. ఏకధాటిగా వర్షం కురుస్తుండటం వల్ల అధికారులు అప్రమత్తమయ్యారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు ఆర్డీఓ నాగన్న తెలిపారు. పెన్నా, కుందు నది పరివాహక ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశామన్నారు. గండికోట, మైలవరం జలాశయం పరివాహక ప్రజలు సైతం అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.
ఇదీ చూడండి:రైతు ఆత్మహత్య.. పంట నష్టంపై కేసీఆర్‌కు వీడియో
TAGGED:
నివర్ తుఫాన్