భాజపా నేతలు తెరాస ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. హైదరాబాద్ బేగంపేట హరిత ప్లాజా హోటల్లో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలపై రూపొందించిన రైతు మార్గదర్శి పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు. నిన్న నగరంలో భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా చేసిన విమర్శల పై మంత్రి నిరంజన్‌రెడ్డి ఘాటుగా స్పందించారు. గతంలో సాక్ష్యాత్తు ప్రధాని, కేంద్ర మంత్రులు తెలంగాణ వచ్చి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకాలను ప్రశంసించారని గుర్తు చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు, కార్యక్రమాలపై అధ్యయనం చేసిన నీతి ఆయోగ్... అద్భుతమని కితాబు ఇవ్వడమే కాకుండా రాష్ట్రానికి 24 వేల కోట్ల రూపాయలు గ్రాంట్ ఇవ్వాలని కేంద్రానికి సూచిందన్నారు. దేశంలో భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఐదారు లక్షల ఎకరాలకు సాగు నీరందే ప్రాజెక్టు నిర్మించిందా? కనీసం రైతులకు ఆర్థిక ప్రేరణ, చేయూతనిచ్చే కార్యక్రమాలు చేపట్డారా? అని మంత్రి ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు మూడేళ్లల్లో పూర్తి చేసిన ఘనత కేసీఆర్ సర్కారుకే దక్కిందని, ప్రాజెక్టు సందర్శించిన కేంద్ర జల సంఘం అద్భుతమని ప్రశంసించిందని స్పష్టం చేశారు. తెరాస ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారేలా భాజపా నాయకత్వం విమర్శలు చేస్తే సహించబోమని మంత్రి హెచ్చరించారు.
జేపీ నడ్డా విమర్శల పై మండిపడ్డ మంత్రి నిరంజన్ రెడ్డి - మిషన్ భగీరథ
భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా పై రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను భాజపా పాలిత రాష్ట్రాల్లో చేశారా? అంటూ విమర్శలు గుప్పించారు. బేగంపేటలో రాష్ట్ర వ్యవసాయ పరిశ్రమల సంస్థ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు మార్గదర్శి పుస్తకాన్ని ఆవిష్కరించారు.
విమర్శల పై ఘాటు విమర్శలు!!