Niranjan Reddy Counter to Bandi Sanjay: అధికారంలోకి వచ్చిన వెంటనే సచివాలయం డోమ్‌లు కూలుస్తామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలకు.. మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న జాతీయ పార్టీల అధ్యక్షులు అజ్ఞానంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అలా మాట్లాడటం వీరత్వం, ధీరత్వం అనుకుంటున్నారని దుయ్యబట్టారు. చరిత్ర తెలియదు.. వర్తమానం తెలియదని విమర్శించారు. అంతకన్నా భవిష్యత్తు మీద దార్శనీకత లేదని ఆరోపించారు. హైదరాబాద్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇది పార్టీల పతనావస్థకు నిదర్శనం:ఇరు పార్టీల అధ్యక్షులు అనాగరిక ప్రేలాపనలు చేస్తున్నారని నిరంజన్ రెడ్డి ఆరోపించారు. సెక్రటేరియట్ గుమ్మటం విషయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అనాగరికంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇది పార్టీల పతనావస్థకు నిదర్శనమని విమర్శించారు. ఎర్రకోట నుంచి.. బీజేపీ నాయకుడు జెండా ఎగిరేసి మాట్లాడుతారని.. వాటికి కూడా గుమ్మటాలు ఉన్నాయని.. గడ్డపార పట్టుకొని వాటిని కూల్చుతారా అని ప్రశ్నించారు.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సుమోటోగా డీజీపీ చర్య తీసుకోవాలని నిరంజన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. సచివాలయ గుమ్మటాలపై రాజకీయాలు చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. అనేక రాష్ట్రాలల్లో ఇలానే డోమ్స్ ఉన్నాయని.. అందానికి చిహ్నంగా ఉన్నవాటిని కూలగొట్టాలని అనడం ఏంటని నిలదీశారు. ఇది బండి సంజయ్ అజ్ఞానానికి నిదర్శనమని వివరించారు. దీనిపై బీజేపీ సమాధానం చెప్పాలని నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు.
సచివాలయ భవన గుమ్మటాలు కూలుస్తాం : ఈరోజు హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లో బండి సంజయ్ పాల్గొన్నారు. నూతనంగా నిర్మించిన సచివాలయ భవన డోమ్‌లను తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూల్చివేసి.. భారతీయ తెలంగాణ సంస్కృతి ప్రకారం పునర్మిస్తామని ఆయన తెలిపారు. సచివాలయాన్ని అక్బరుద్దీన్ తాజ్‌మహల్‌తో పోల్చారని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు విని కేసీఆర్ ఆనందించారని బండి సంజయ్ మండిపడ్డారు.