తెలంగాణ

telangana

ETV Bharat / state

Amaravati Padayatra: ఒక రోజు విరామం తర్వాత 'అమరావతి మహాపాదయాత్ర' ప్రారంభం - ap latest news

వారిది ఒకటే స్వప్నం.. ఒకటే ఆశయం.. ఒకటే ఆశ, ఆకాంక్ష.. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి ఉండాలని. బాధను పంటి బిగువు భరిస్తూ.., ఆందోళన వ్యక్తపరుస్తూ.. అమరావతి స్వప్నాన్ని తలుచుకుంటూ.. రెండేళ్లుగా సుదీర్ఘ దీక్ష కొనసాగించిన అమరావతి రైతులు.. ఇప్పుడు మహాపాదయాత్రగా జనాల్లోకి కదిలారు. ఈ రోజు తొమ్మిదో రోజు మహాపాదయాత్ర (Amaravati Padayatra)లో భాగంగా ఇంకొల్లు నుంచి దుద్దకూరు వరకు 10.5 కి.మీల పాదయాత్ర సాగనుంది.

Amaravati Padayatra
Amaravati Padayatra

By

Published : Nov 9, 2021, 10:12 AM IST

Amaravati Padayatra: ఒక రోజు విరామం తర్వాత 'అమరావతి మహాపాదయాత్ర' ప్రారంభం

ఏపీ ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న పాదయాత్ర (Amaravati Padayatra) ఒక రోజు విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర తొమ్మిదో రోజైన ఇవాళ ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు 10.5 కిలోమీటర్ల మేర సాగనుంది. జై అమరావతి అంటూ నినాదాల మధ్య పాదయాత్ర ముందుకు సాగుతోంది.

45 రోజుల పాటు యాత్ర

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులకు ఇంకొల్లు ప్రాంత రైతులు, స్థానికులు సంఘీభావం తెలిపారు. అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగి డిసెంబర్‌ 15న తిరుమలలో ముగియనుంది.

ఎన్ని ఆటంకాలు ఎదురైనా...

ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా.. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ మహాపాదయాత్రను కొనసాగిస్తామని రాజధాని మహిళా రైతులు స్పష్టం చేశారు. రాష్ట్రాభివృద్ధి కోసం భూములిచ్చిన తమను ప్రస్తుత ప్రభుత్వం అన్యాయం చేసిందని వాపోయారు. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామికి మొర పెట్టుకునేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. పాదయాత్ర చేస్తున్న కొంతమంది మహిళలకు కాళ్లు వాయగా, మరికొందరికి బొబ్బలెక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రకాశం జిల్లా రైతులు, మహిళలు ఇస్తున్న మద్దతు, సహకారంతో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేస్తామని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. తొమ్మిదో రోజులో భాగంగా ఇంకొల్లు నుంచి దుద్దుకూరు వరకు 10.5 కి.మీ పాదయాత్ర సాగనుంది.

రైతులకు మద్దతుగా మహిళా జేఏసీ నేతల పూజలు..

"న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ" పేరుతో అమరావతి పరిరక్షణ సమితి, రైతులు చేపట్టిన మహాపాదయాత్ర విజయవంతంగా పూర్తికావాలని కోరుతూ... మహిళా జేఏసీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న కార్తికమాసం తొలి సోమవారం కావడంతో శివయ్యకు దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆంద్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతిని ప్రభుత్వం ప్రకటించేలా ముఖ్యమంత్రి జగన్​కు పరమేశ్వరుడు మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకున్నట్లు మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ తెలిపారు.

మహాపాదయాత్రను ప్రజలు పూలతో స్వాగతం పలుకుతుంటే.. ప్రభుత్వం, పోలీసులు అడుగడుగునా అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్, అభివృద్ధి అమరావతితో ముడిపడి ఉందని ఆమె పేర్కొన్నారు. పోలీసులు అక్రమ కేసులు బనాయించినా, అవమానాలు ఎదురైనా రాష్ట్ర భవిష్యత్ కోసం భరించామని తెలిపారు. రైతుల త్యాగాలు వృథా కాకుండా మహా పాదయాత్రతో ముఖ్యమంత్రి జగన్ కళ్లు తెరిపించాలని శివయ్యను కోరుకున్నట్లు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details