తెలంగాణ

telangana

గ్రేటర్​​ హైదరాబాద్​లో నేటి నుంచి సీరో సర్వే

By

Published : Jan 8, 2021, 9:16 AM IST

గ్రేటర్‌లో కొవిడ్‌ వ్యాప్తిని, ప్రజల్లోని వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేసేందుకు ఎన్‌ఐఎన్‌(జాతీయ పోషకాహార సంస్థ) భారీ ‘సీరో’ సర్వేకి సిద్ధమైంది. శాస్త్రవేత్తలు, ఆరోగ్య సిబ్బంది కలిపి మొత్తం 100 మంది రంగంలోకి దిగుతున్నారు. నగరవ్యాప్తంగా 9వేల మంది రక్త నమూనాలు సేకరించనున్నారు. నేటి నుంచే సర్వే మొదలు కానుంది.

గ్రేటర్​​లో నేటి నుంచి సీరో సర్వే
గ్రేటర్​​లో నేటి నుంచి సీరో సర్వే

గ్రేటర్‌లో కొవిడ్‌ వ్యాప్తిని, ప్రజల్లోని వ్యాధి నిరోధక శక్తిని అంచనా వేసేందుకు ఎన్‌ఐఎన్‌ భారీ ‘సీరో’ సర్వే చేపట్టనుంది. ఈ కార్యక్రమం నేటి నుంచి అమలు కానుంది. దీని ద్వారా ఇప్పటి వరకు నగరంలో ఎంత మంది కొవిడ్‌ వ్యాధి నిరోధక శక్తి కలిగి ఉన్నారనేది తేలుతుంది. కొవిడ్‌ వ్యాక్సిన్‌ అనంతరం ఇదే తరహాలో మళ్లీ ‘సీరో’ సర్వే జరగనుంది. వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో ఎంత మందికి, ఏ స్థాయిలో రోగ నిరోధక కణాలు ఉత్పత్తయ్యాయో లెక్క తేలుతుంది. వాటి ఆధారంగా సామూహిక వ్యాధి నిరోధకశక్తి(హెర్డ్‌ ఇమ్యునిటీ)ని లెక్కించడం సాధ్యమవుతుందని ఎన్‌ఐఎన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఎ.లక్ష్మయ్య తెలిపారు.

గతంలో ఇలా.. గతేడాది మేలో ఎన్‌ఐఎన్‌ ఆధ్వర్యంలో సీరో సర్వే జరిగింది. ఆదిభట్ల, టప్పాచబుత్ర, మియాపూర్‌, చందానగర్‌, బాలాపూర్‌ ప్రాంతాల్లో 500 నమూనాలు పరీక్షిస్తే 15 మందికి పాజిటివ్‌ అని తేలింది. ఇప్పుడు ఇలా.. నగరంలో 8 నెలల అనంతరం రెండోసారి సీరో సర్వే జరుగుతోంది. ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్తలు 30 వార్డులను ర్యాండమ్‌గా ఎంచుకున్నారు. ఒక్కో వార్డులోని 100 ఇళ్లలో రక్త నమూనాలు తీసుకోనున్నారు.

ఎప్పట్నుంచి ఎప్పటి వరకు..

నేటి నుంచి జనవరి 12 వరకు చార్మినార్‌, ఖైరతాబాద్‌ జోన్ల పరిధిలోని 15 వార్డుల్లో, జనవరి 18 నుంచి 22 వరకు కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సికింద్రాబాద్‌, ఎల్బీనగర్‌ జోన్లలోని 15 వార్డుల్లో సర్వే చేపట్టనున్నారు. పది పని దినాల్లో పూర్తి చేయాలన్నది లక్ష్యం. తక్కువ సమయంలో ఎక్కువ రక్త నమూనాలను సేకరించడం వల్ల అత్యంత కచ్చితమైన ఫలితం వస్తుందంటున్నారు.

ఇదీ చూడండి:పీహెచ్‌సీల్లోనూ కరోనా టీకా నమోదుకు అవకాశం

ABOUT THE AUTHOR

...view details