Medical Student Latest Health Bulletin: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన కేఎంసీ విద్యార్థిని తాజా హెల్త్ బులిటెన్‌ను నిమ్స్ వైద్యులు విడుదల చేశారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మరోవైపు విద్యార్థిని ఆత్యహత్యాయత్నం కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ సైఫ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు.
విద్యార్థినికి ఎక్మో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నామని నిమ్స్ వైద్యులు తెలిపారు. మొది రెండు రోజులతో పోలిస్తే ఇప్పుడు విద్యార్థిని కిడ్నీ, గుండె పనితీరు కొంచెం మెరుగ్గానే ఉన్నాయని వివరించారు. ఆమెకు డయాలసిస్ జరుగుతోందని హెల్త్ బులిటెన్‌లో ప్రకటించారు. నిపుణులైన వైద్య బృందం విద్యార్థినిని నిశితంగా పరిశీలిస్తోందని నిమ్స్ వైద్యులు వెల్లడించారు.
మరో వైపు వైద్య విద్యార్థినిని గిరిజన, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాఠోడ్ పరామర్శించారు. విద్యార్థినికి నిమ్స్‌లో మెరుగైన వైద్యం అందుతోందని అన్నారు. మొదటి రెండు రోజుల కంటే ఈరోజు పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని మంత్రి తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగడం చాలా దురదృష్టకరమని.. దీనిపై ప్రభుత్వం ఒక కమిటీని నియమించిందని వివరించారు. విద్యార్థినికి ఈ పరిస్థితి రావడానికి కారణమైన బాధ్యులు ఎవరైనా ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.