PG Medical Student Health Bulletin Update:పీజీ వైద్య విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. ఆమె ఆరోగ్యం విషమంగా ఉందని నిమ్స్ సూపరింటెండెంట్ తెలిపారు. వైద్య విద్యార్థిని కొన్ని అవయవాలు సరిగా పనిచేయడం లేదన్న ఆయన.. ఆర్ఐసీయూలో ఎక్మోపై చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. ప్రత్యేక వైద్య బృందం విద్యార్థిని చికిత్సను పర్యవేక్షిస్తుందని సూపరింటెండెంట్ పేర్కొన్నారు.
ఫోన్ తనిఖీ చేస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయి: వరంగల్ కేఎంసీలో ఆత్మహత్యాయత్నానికి యత్నించిన విద్యార్ధినికి నిమ్స్‌లో చికిత్స కొనసాగుతోంది. ఆమె బీపీ, షుగర్ లెవల్స్ భారీగా పడిపోయినట్లు నిమ్స్ వైద్యులు తెలిపారు. ఆమె శరీరం చికిత్సకు సహకరించడం లేదన్నారు. ప్రస్తుతం కృత్రిమ శ్వాస అందిస్తున్నామని... ఎక్మో సపోర్ట్‌తో చికిత్స చేస్తున్నట్లు వెల్లడించారు. ఇదే చివరి ప్రయత్నం అని వైద్యులు వెల్లడించారని ఆమె తండ్రి తెలిపారు. వైద్యులు ఆమెకు అత్యుత్తమ చికిత్స అందిస్తున్నామని చెబుతున్నారన్నారు.
కేఎంసీలో ర్యాగింగ్ జరగలేదు : వరంగల్ కాకతీయ వైద్య కళాశాలలో ఎటువంటి ర్యాగింగ్ జరగలేదని... రాష్ట్ర వైద్య విద్యా సంచాలకుడు రమేశ్‌రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాగ్ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆమెకు, సైఫ్ మధ్య మనస్పర్థలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యార్థిని ఆరోగ్యం విషమంగానే ఉందని.. వెంటిలేటర్‌పై విద్యార్థినికి చికిత్స కొనసాగుతోందని రమేశ్‌రెడ్డి తెలిపారు. కేఎంసీలో ర్యాగింగ్ జరగలేదన్నారు. దీనిపై ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చారన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే కమిటీ వేశామని రిపోర్టు వచ్చాక చర్యలు తీసుకుంటామని రమేశ్‌రెడ్డి వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు నిమ్స్ వైద్యులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారని వెల్లడించారు.