కరీంనగర్‌కు చెందిన ఒక రోగి కొద్దిరోజులక్రితం కిడ్నీ, ఇతరత్రా ఇబ్బందులతో నెఫ్రాలజీ విభాగంలో చేరారు. ఆయనకు పలు రకాల పరీక్షలు చేయించాలని వైద్యులు సూచించారు. ఇవన్నీ కూడా నిమ్స్‌లో ఉదయం చేయిస్తే సాయంత్రానికి వస్తాయి. వైద్యుడి పరీక్షలు చేయించాలని సూచించిన పది నిమిషాల్లోనే రోగి పడక దగ్గరకు ప్రైవేటు ల్యాబ్ ప్రతినిధి వచ్చాడు. పరీక్షలన్నీ మేం చేస్తాం.. ఇంత ఖర్చవుతుందంటూ చెప్పాడు. లేదు ఆస్పత్రిలోనే చేయించాకుంటానని చెప్పగా మాకు వైద్యుల నుంచి తోడ్పాటు లభించలేదని రోగి బంధువులు చెప్పారు.
నిమ్స్ ఆస్పత్రిలో సరికొత్త దందా కొనసాగుతోంది (NIMS Doctor scam). ప్రైవేటు ల్యాబ్‌లతో కొంతమంది వైద్యులు కుమ్మక్కైన వ్యవహారం పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. వందల కిలో మీటర్ల దూరం నుంచి వచ్చిన రోగులను ప్రైవేటు ల్యాబ్‌ల్లో వైద్య పరీక్షలు చేయించుకోమని కొంతమంది వైద్యులు ఒత్తిడి తేవడం చర్చనీయాంశమైంది. ఆ ల్యాబ్‌ల నుంచి పరీక్షా నివేదికలు వస్తేనే శస్త్రచికిత్సలు చేస్తామని వైద్యులు హెచ్చరిస్తుండటంతో రోగుల బంధువుల ఆందోళన చెందుతున్నారు. కమీషన్ల కక్కుర్తితోనే ఈ మొత్తం తంతు జరుగుతోందని అనేకమంది చెబుతున్నారు. కొంతమంది వైద్యులు నిజాయతీగా నిమ్స్‌లోనే పరీక్షలు చేయించి పూర్తిస్థాయి వైద్యం చేస్తుండగా కొందరు మాత్రం పక్కదారిపట్టడం పట్ల రోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.