భాగ్యనగరానికి ఇతర ప్రాంతాల నుంచి వివిధ పనుల నిమిత్తం ప్రతిరోజు లక్షలాది మంది వస్తుంటారు. ఇందులో అధికశాతం ఆస్పత్రిలో రోగులవద్దకు వచ్చినవారుంటారు. వారు రహదారులు, జంక్షన్ల వద్ద తాత్కాలికంగా బస చేస్తుంటారు. నగరంలో రహదారులు, ఫుట్‌పాత్‌లపై నిరాశ్రయులు లేకుండా జీహెచ్ఎంసీ నైట్ షెల్టర్లు ఏర్పాటు చేసింది. కానీ ఈ మహానగరానికి అవసరమైనదాంట్లో 10 శాతం కూడా ఆవాస కేంద్రాలు లేవు.
ఉన్న షెల్టర్లలో సదుపాయాల్లేవ్
ప్రజల అవసరానికి సరిపడా నైట్ షెల్టర్ల సంఖ్య పెంచుతామని నాలుగేళ్లుగా జీహెచ్ఎంసీ చెబుతూ వస్తోంది. కానీ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. ఎక్కడో దూరంగా ఎవరికీ తెలియని ప్రాంతాల్లో షెల్టర్లు ఉండటం వల్ల అక్కడికి వెళ్లి ఉండేవాళ్లు తగ్గిపోతున్నారు. ఉన్న షెల్టర్లలో కూడా కనీస సదుపాయాలు లేవు. సరైనన్ని పడకలు, తాగునీరు, కాలకృత్యాలు తీర్చుకునేందుకు, స్నానాలు చేసేందుకు ఏర్పాట్లు లేకపోవడం వల్ల చాలా తక్కువ మంది మాత్రమే వీటిని వినియోగించుకుంటున్నారు.
ఇదేం సర్వే?
ఏడాదిన్నర క్రితం జీహెచ్ఎంసీ సర్వే చేసి నగరంలో కేవలం 1491 మంది నిరాశ్రయులు ఉన్నట్లు గుర్తించారు. నాలుగేళ్ల క్రితమే 3వేల 500 మంది ఉండగా... ఏడాది క్రితం ఆ సంఖ్య సగం కంటే తగ్గిపోయింది. కోటిమంది జనాభా ఉన్న నగరంలో ఇంత తక్కువ నిరాశ్రయులుండటం ఏంటని ప్రజలు సైతం ఆశ్చర్యపోయేలా జీహెచ్ఎంసీ వ్యవహరిస్తోంది.