పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది రఘునాథ్ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సరూర్‌నగర్ ఠాణా పరిధిలోని పీఎన్టీ కాలనీలో ఉన్న ఆయన నివాసంలో తనిఖీలు చేపట్టిన అధికారులు పలు పత్రాలు, పుస్తకాలను పరిశీలిస్తున్నారు. కంప్యూటర్, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకొని అందులో ఉన్న సమాచారాన్ని విశ్లేషిస్తున్నారు.
పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడి ఇంట్లో ఎన్ఐఏ సోదాలు - Telangana news
హైదరాబాద్ సరూర్‌నగర్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, న్యాయవాది రఘునాథ్ ఇంట్లో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు సోదాలు చేపట్టారు. పలు పత్రాలు, పుస్తకాలు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ స్వాధీనం చేసుకుని అందులోని సమాచారాన్ని పరిశీలిస్తున్నారు.
గతేడాది నవంబర్ 23న ఏపీ విశాఖపట్నం జిల్లాలో పంగి నాగన్న అనే మావోయిస్టు కొరియర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మావోయిస్టులకు సహకరించడం, కూంబింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థులను రెచ్చగొడ్తున్నట్లు పోలీసులు పంగి నాగన్నపై అభియోగం మోపారు. ఆయన నుంచి సేకరించిన సమాచారం ప్రకారం మావోయిస్టు నేతలతో పాటు పలువురు పౌరహక్కుల సంఘం నేతలను నిందితులుగా పేర్కొన్నారు.
పంగి నాగన్నపై ఎన్ఐఏ ఈనెల 7న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. విశాఖపట్నం పోలీసుల నుంచి తీసుకున్న సమాచారం ఆధారంగా ఎన్ఐఏ అధికారులు తెలుగు రాష్ట్రాల్లోని పలువురు పౌర హక్కుల సంఘం నేతల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.