దర్భంగా పేలుడు కేసు (DARBHANGA BLAST)లో జాతీయ దర్యాప్తు సంస్థ లోతుగా విచారణ జరుపుతోంది. ఇప్పటికే సోదరులైన ఇద్దరు నిందితులు మహమ్మద్ నసీర్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్‌లను అదుపులోకి తీసుకున్న అధికారులు.. ఇవాళ వారిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ అనంతరం పట్నాకు తరలించారు. ఇద్దరిని అక్కడి కోర్టులో హాజరుపరిచి.. తిరిగి కస్టడీలోకి తీసుకొని విచారణ జరపాలని ఎన్ఐఏ అధికారులు భావిస్తున్నారు.
హైదరాబాద్ మల్లేపల్లిలోని నిందితుల ఇళ్లలో తనిఖీలు చేసిన ఎన్‌ఐఏ బృందం పలు కీలక పత్రాలు, పేలుడు పదార్థాలకు సంబంధించిన పరికరాలు స్వాధీనం చేసుకుంది. హైదరాబాద్‌లో వీరికి ఎవరైనా సహకరించారా అన్న కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నారు.
మహ్మద్ నసీర్ ఖాన్ 2012లో పాకిస్థాన్ వెళ్లి ఎల్ఈటీలో శిక్షణ పొందాడని ఎన్ఐఏ తెలిపింది. రసాయనాలతో ఐఈడీ తయారు చేయడంలో నసీర్ శిక్షణ పొందాడని, సోదరుడు ఇమ్రాన్‌తో కలిసి ఐఈడీ తయారు చేశాడని వెల్లడించింది. వస్త్రాల్లో ఐఈడీ పెట్టి సికింద్రాబాద్-దర్భంగా రైల్‌లో పార్సిల్ పంపారని ఎన్‌ఐఏ దర్యాప్తులో తేలింది. రైలులో పేలి మంటలు వ్యాపించి ప్రాణ నష్టం జరిగేలా కుట్ర చేసినట్లు ఎన్ఐఏ తెలిపింది. నసీర్, ఇమ్రాన్ పాక్‌లో లష్కరే తొయిబా ఉగ్రవాదులతో టచ్‌లో ఉన్నారని, నిందితులను లోతుగా ప్రశ్నించి భారీ కుట్రను ఛేదించాల్సి ఉందని ఎన్ఐఏ స్పష్టం చేసింది.