DARBHANGA RAIL BLAST CASE : దర్భంగ పేలుళ్ల కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. పాట్నాలోని ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో ఛార్జ్‌షీట్ దాఖలు చేసిన ఎన్ఐఏ.... ఐదుగురిపై అభియోగం మోపింది. మహ్మద్ నసీర్ ఖాన్, ఇమ్రాన్ మాలిక్, సలీం అహ్మద్, కఫిల్ అహ్మద్, ఇక్బాల్ మహమ్మద్‌ను నిందితులుగా పేర్కొన్నారు. జూన్ 17న దర్భంగ రైల్వే స్టేషన్లో పేలుడు సంభవించింది. స్థానిక ఠాణాలో కేసు నమోదైన తర్వాత ఎన్ఐఏకు బదిలీ అయింది. ఎన్ఐఏ అధికారులు దర్యాప్తు చేపట్టి... పేలుళ్లలో లష్కరే తోయిబా పాత్ర ఉందని తేల్చారు. పాకిస్థాన్‌లో ఉంటూ లష్కరే తోయిబా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్న హఫీజ్ ఇక్బాల్ ఆదేశాల మేరకు రైల్వే బాంబు పేల్చేందుకు కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.
NIA FILES CHARGE SHEET ON DARBHANGA INCIDENT : ఈ మేరకు నసీర్ ఖాన్ పలుసార్లు పాకిస్థాన్ వెళ్లి బాంబులు తయారీలో శిక్షణ పొందాడు. అనంతరం హైదరాబాద్ వచ్చి తన సోదరుడు ఇమ్రాన్ మాలిక్‌తో కలిసి హబీబ్‌నగర్‌లో చీరల వ్యాపారం పేరుతో నివాసం ఉన్నారు. పాకిస్థాన్ నుంచి పలుసార్లు నసీర్ ఖాన్‌కు నిధులు కూడా వచ్చినట్లు ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో తేలింది. పేలుళ్ల కోసం చీరల మూటలో బాంబు పెట్టి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చి దర్భంగ ఎక్స్‌ప్రెస్ రైళ్లో చీరల పార్శిల్ పంపించారు. కదులుతున్న రైల్లో బాంబులు పేల్చడం వల్ల ప్రాణనష్టం కలిగించేందుకు కుట్ర పన్నారని ఎన్ఐఏ ఛార్జ్ షీట్‌లో పేర్కొంది.
కదులుతున్న రైల్లో బాంబు పేలి మంటలు అంటుకొని తీవ్ర ప్రాణనష్టం కలిగేలా చేయాలని లష్కరే తోయిబా కుట్ర పన్నినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. పేలుళ్ల తర్వాత నిందితులు నేపాల్ మీదుగా విదేశాలకు పారిపోయేందుకు ప్రయత్నించారు. పకడ్బందీగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. దర్భంగ పేలుళ్లకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్ఐఏ అధికారులు తెలిపారు.
కేసు ఏమిటంటే..
DARBHANGA RAIL BLAST CASE : యూపీకి చెందిన మాలిక్ సోదరులు తమ తల్లితో కలిసి ఆరేళ్ల కిందట హైదరాబాద్‌కు వచ్చారు. ఫుట్‌పాత్‌పై బట్టలు విక్రయిస్తు మల్లేపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నారు. అనారోగ్యంగా ఉన్న తమ తల్లికి చికిత్స చేయించేందుకు వచ్చినట్టు ఇంటి యజమానికి తెలిపారు. లష్కరేతోయిబా ఆదేశాల కోసం వేచి చూసి ఆదేశాలు అందగా గత నెల 15న భారీ పేలుళ్లకు కుట్ర పన్నారు. ముందుగా ఇంట్లోనే ఐఈడీ ద్రావణాన్ని తయారు చేసి వస్త్రాల మధ్య ఉంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్‌లో ఇచ్చారు.