దిశ హత్య కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌పై మీడియాలో వచ్చిన కథనాలను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టిన జాతీయ మానవ హక్కుల కమిషన్... నిందితుల కుటుంబ సభ్యులను కూడా విచారించింది. రెండో రోజు సీనియర్ ఎస్పీ మన్‌జీత్ సైనీతో కూడిన ఏడుగురు సభ్యుల బృందం నిందితుల కుటుంబసభ్యుల నుంచి పలు వివరాలు అడిగి తెలుసుకుంది. ఈ విచారణకు దిశ హత్య కేసు ప్రధాన నిందితుడు ఆరీఫ్ తండ్రి హుస్సేన్, జొల్లు శివ తండ్రి రాజప్ప, చెన్నకేశవులు తండ్రి కురుమయ్య, నవీన్ తల్లి లక్ష్మీ హాజరయ్యారు. ఎన్‌కౌంటర్ గురించి అనుమానాలున్నాయా, నిందితుల కుటుంబాల ఆర్థిక పరిస్థితి, కుటుంబసభ్యులు ఏం చేస్తుంటారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుల వ్యక్తిగత వివరాలను కూడా తెలుసుకున్నారు. ప్రస్తుతం వారి కుటుంబాలకు జీవనాధారమేమిటనే కోణంలోనూ పలు అంశాలు తెలుసుకున్నారు.
దిశ తండ్రి, సోదరిని ప్రశ్నించిన ఎన్హెచ్ఆర్సీ...
మరో వైపు దిశ తండ్రి, సోదరిని కూడా ఎన్హెచ్ఆర్సీ బృందం ప్రశ్నించింది. ఎన్‌కౌంటర్ గురించి ముందే తెలుసా, అసలు ఏం జరిగింది, మీకేమైనా సమస్యలున్నాయా, అంటూ గంట సేపు పాటు వారిని ప్రశ్నించి సమాచారం సేకరించారు. ఎన్‌కౌంటర్ గురించి టీవీల్లో చూసిన తర్వాతే తమకు తెలిసిందని, పోలీసుల నుంచి దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని వారు కమిషన్ సభ్యులకు వివరించారు.
రిమాండ్లో ఉండగానే ఎన్ కౌంటర్ చేసి చంపడం న్యాయమా..?
ఎన్హెచ్ఆర్సీ బృందం అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చిన నిందితుల కుటుంబ సభ్యులు ఎన్‌కౌంటర్‌పై తమ వాదనలు కూడా వినిపించారు. తమ బిడ్డలు చేసింది క్షమించరాని నేరమే అయినా... న్యాయ విచారణ జరగకుండానే, రిమాండ్లో ఉండగానే ఎన్ కౌంటర్ చేసి చంపడం న్యాయమా?... అని ఎన్హెచ్ఆర్సీ సభ్యుల ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు . కనీసం చివరిచూపునకు నోచుకోకుండా... అరెస్టు చేసినప్పటి నుంచి మాట కూడా మాట్లాడనివ్వకుండా చివరికి ప్రాణాలు తీసేసారని కమిషన్ ముందు వాపోయారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపైనా కుటుంబ సభ్యులు సందేహాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
ప్రభుత్వపరంగా న్యాయం జరిగేలా చూడాలి...