తెలంగాణ

telangana

ETV Bharat / state

NGT: రిజర్వాయర్ల నిర్మాణ వివాదంపై జోక్యం చేసుకోలేం - స్రవంతి పథకాలు వార్తలు

అనుమతులు లేకుండా గాలేరు- నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల కింద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారంటూ ఏపీలోని చిత్తూరు జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని ఎన్జీటీ చెన్నై బెంచ్‌ స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ వాదనను పరిశీలించాక పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా నిర్ణయం తీసుకుంటామంది.

ngt
ఎన్జీటీ చెన్నై బెంచ్‌

By

Published : Jul 6, 2021, 9:15 AM IST

అనుమతులు లేకుండా గాలేరు- నగరి సుజల స్రవంతి, హంద్రీనీవా సుజల స్రవంతి పథకాల కింద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారంటూ ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా రైతులు దాఖలు చేసిన పిటిషన్‌లో జోక్యం చేసుకోలేమని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై బెంచ్‌ స్పష్టం చేసింది. దీనిపై ఏపీ ప్రభుత్వ వాదనను పరిశీలించాక పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలా లేదా నిర్ణయం తీసుకుంటామంది. ఇప్పటికే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై విచారణలో ఉన్న కేసులో ఇది భాగమైతే జరిమానా విధిస్తామని హెచ్చరించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో కలిపి దీన్ని విచారణ చేపడతామంటూ 23వ తేదీకి వాయిదా వేసింది. గాలేరు-నగరి, హంద్రీనీవా పథకాల కింద ఎలాంటి పర్యావరణ అనుమతుల్లేకుండా చిత్తూరు జిల్లా కురబలకోట మండలం ముదివీడు, పుంగనూరు మండలం నేతిగుంటపల్లి, సోమల మండలం ఆవులపల్లి రిజర్వాయర్ల నిర్మాణాన్ని సవాలు చేస్తూ సోమల మండలానికి చెందిన జి.గుణశేఖర్‌ మరో 12 మంది రైతులు పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్‌ కె.రామకృష్ణన్‌, డాక్టర్‌ కె.సత్యగోపాల్‌లతో కూడిన ఎన్జీటీ బెంచ్‌ సోమవారం విచారణ చేపట్టింది.

రాయలసీమ ఎత్తిపోతలతో సంబంధం లేదు

పిటిషనర్ల తరఫు న్యాయవాది కె.శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై వేసిన పిటిషన్‌తో దీనికి సంబంధం లేదన్నారు. ఇది రిజర్వాయర్ల విషయమని, రైతుల భూములకు సంబంధించినదని చెప్పారు. ఈ పథకాల కింద ఇప్పటికే 7 రిజర్వాయర్లు కట్టారని, మరో మూడు నిర్మించనున్నారని వివరించారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఏర్పాటైన జాయింట్‌ కమిటీ నివేదిక ఇవ్వాల్సి ఉందన్నారు. అది ప్రాజెక్టా, ఎత్తిపోతల పథకమా అన్నది తేలేదాకా ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించిందని చెప్పలేమని పేర్కొంది. ఏపీ తరఫున సీనియర్‌ న్యాయవాది వెంకటరమణి, దొంతి మాధురిరెడ్డిలు వాదనలు వినిపిస్తూ దీనికి సంబంధించి సాధ్యాసాధ్యాలపై పరిశీలన జరుగుతోందని, ఈ దశలో వ్యక్తులు వచ్చి ఎలా పిటిషన్‌ వేస్తారన్నారు. పూర్తి వివరాలతో కౌంటరు దాఖలు చేస్తామని, ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న కోర్టు ధిక్కరణ పిటిషన్‌తో కలిపి విచారించాలని కోరారు. తమ పిటిషన్‌ను విచారణకు స్వీకరించాలని రైతుల తరఫు న్యాయవాది కోరగా ధర్మాసనం నిరాకరించింది.

పాలమూరు-రంగారెడ్డిని అడ్డుకోండి.. ఎన్జీటీలో ఏపీ రైతుల ఫిర్యాదు

తెలంగాణ అనుమతి లేకుండా నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల వల్ల ట్రైబ్యునల్‌ కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని దీనిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రైతులు చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ)లో పిటిషన్‌ దాఖలు చేశారు. తాగునీటి పేరుతో సాగునీటి కోసం భారీ పనులు చేపట్టారని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చంద్రమౌళీశ్వరరెడ్డి, మరో ఎనిమిదిమంది రైతులు సోమవారం ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. అందులోని ముఖ్యాంశాలివి..

‘‘కృష్ణా ట్రైబ్యునల్‌-1, 2లో కూడా ఈ ప్రాజెక్టుకు కేటాయింపులు లేవు. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులలో కూడా లేదు. దీని నిర్మాణం వల్ల ఎస్సార్బీసీ, కేసీ కాలువ, నాగార్జునసాగర్‌, కృష్ణాడెల్టా రైతుల ప్రయోజనాలతోపాటు పునర్విభజన చట్టం 11వ షెడ్యూలులో పేర్కొన్న కల్వకుర్తి, నెట్టెంపాడు రైతుల ప్రయోజనాలు కూడా దెబ్బతింటాయి. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో తెలంగాణ 299 టీఎంసీలు, ఏపీ 512 టీఎంసీలు వినియోగించుకొనేలా ఒప్పందం జరిగింది. మిగులు జలాలను 11వ షెడ్యూలులో పేర్కొన్న ప్రాజెక్టులకు వినియోగించుకోవాలి. నీటి లభ్యత అధ్యయనం, దిగువ ప్రాజెక్టులపై ప్రభావం వంటివేమీ లేకుండానే 90 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల చేపట్టారు. 2016లో జరిగిన అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీలో ఈ ప్రాజెక్టు 11వ షెడ్యూలులో లేదని, కృష్ణా బోర్డు ఆమోదం తెలపలేదని కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ చెప్పింది. ట్రైబ్యునల్‌-2 కేటాయింపులలోనే వాడుకుంటామని తెలంగాణ చెప్పింది. ఇది తప్పుదోవ పట్టించడమే. కృష్ణా ట్రైబ్యునల్‌-1లో కానీ, 2లో కానీ దీనికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఇది అనధికార నిర్మాణమే. 2021 కల్లా పథకాన్ని పూర్తి చేసి తాగు, సాగునీరు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం చేపట్టిన పంపుహౌస్‌ పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంలో ఉంది. వీటన్నింటినీ పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలి’’ అని ఎన్జీటీని కోరారు.

ఇదీ చదవండి:TS AP WATER WAR: కృష్ణా జలాల వివాదంపై స్వరం పెంచిన తెలుగు రాష్ట్రాలు

ABOUT THE AUTHOR

...view details