తెలంగాణ

telangana

ETV Bharat / state

NGT: రాయలసీమ ఎత్తిపోతలపై విరుద్ధంగా పనులు చేపడితే జైలుకు పంపుతాం

By

Published : Jun 25, 2021, 12:27 PM IST

Updated : Jun 25, 2021, 2:46 PM IST

ngt serious on rayalaseema lift irrigation
ఏపీ సీఎస్‌కు ఎన్జీటీ హెచ్చరిక

12:23 June 25

ఏపీ సీఎస్‌కు ఎన్జీటీ హెచ్చరిక

తమ ఆదేశాలకు విరుద్ధంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపడితే తీవ్ర చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని జాతీయ హరిత ట్రైబ్యూనల్(National Green Tribunal) ఏపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. పనులు జరుగుతున్నట్లు తేలితే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని జైలుకు పంపాల్సి ఉంటుందని హెచ్చరించింది. 

పర్యావరణ అనుమతులు లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు జరపొద్దని ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి పనులు చేపడుతున్నారని తెలంగాణ వాసి గవినోళ్ల శ్రీనివాస్ ఎన్జీటీని ఆశ్రయించారు. ఏపీ సీఎస్ సహా బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని ధిక్కరణ పిటిషన్‌లో శ్రీనివాస్ కోరారు. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ఎన్జీటీ చెన్నై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. గత తీర్పునకు విరుద్ధంగా ఎందుకు పనులు చేపడుతున్నారని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

బోర్డుకు ఏపీ సహకరించడం లేదు..!

నిర్మాణ పనులు చేపట్టడం లేదని.. రెండు వారాల సమయం ఇస్తే కౌంటర్ దాఖలు చేస్తామని ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది విన్నవించారు. తెలంగాణ ప్రభుత్వం కూడా అనుమతులు లేకుండా చాలా ప్రాజెక్టులు కడుతున్నట్లు ఏపీ న్యాయవాది ఆరోపించారు. పిటిషన్‌లోని ప్రాజెక్టు వరకే వాదనలను పరిమితం చేయాలని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదికి ఎన్జీటీ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వకేట్ జనరల్.. ఎన్జీటీ తీర్పు అమలు కావడం లేదని.. పనులు నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కరోనా రెండో ఉద్ధృతిలో ప్రాజెక్టు పనులు చేపట్టారని.. ఎన్జీటీ ఆదేశాల మేరకు ప్రాజెక్టులో తనిఖీలు జరిపేందుకు కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం సహకరించడం లేదని పిటిషనర్ తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలిపారు. 

జులై 12కు విచారణ వాయిదా

ట్రైబ్యునల్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కూడా ఏపీ సర్కారు ఎలాంటి పర్యావరణ అనుమతులు అవసరం లేదంటూ కేంద్ర పర్యావరణ శాఖకు లేఖలు రాస్తోందని పిటిషనర్ న్యాయవాది వివరించారు. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న ఎన్జీటీ ధర్మాసనం... రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం తాజా పరిస్థితిపై నివేదిక ఇవ్వాలంటూ కృష్ణానదీ యాజమాన్య బోర్డు, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ చెన్నై ప్రాంతీయ కార్యాలయాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జులై 12కి వాయిదా వేసింది. 

ఇదీ చూడండి:ONLINE SHOPPING: అవసరం లేకున్నా ఆన్​లైన్ షాపింగ్​ చేస్తున్నారా?

Last Updated : Jun 25, 2021, 2:46 PM IST

ABOUT THE AUTHOR

...view details