తెలంగాణ

telangana

ETV Bharat / state

Black Fungus: కొత్తగా 5 దేశీయ ఫార్మా కంపెనీలకు అనుమతి - Covid medicine

కొవిడ్‌ కంటే దాని తర్వాత కొందరిలో వస్తున్న బ్లాక్‌ఫంగస్‌ వ్యాధి ఇప్పుడు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వ్యాధి చికిత్సలో వినియోగించే ఔషధాల వెల రూ.వేలల్లో ఉండటం, కొరతతో నల్లబజారులో మూడు నాలుగు రెట్లు అధిక ధరకు కొనాల్సి రావడం బాధితుల ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తోంది.

domestic pharma companies
ఫార్మా కంపెనీలకు అనుమతి

By

Published : Jun 6, 2021, 5:05 AM IST

కొవిడ్‌ కంటే దాని తర్వాత కొందరిలో వస్తున్న బ్లాక్‌ఫంగస్‌ వ్యాధి ఇప్పుడు ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తోంది. ఈ వ్యాధి చికిత్సలో వినియోగించే ఔషధాల వెల రూ.వేలల్లో ఉండటం, కొరతతో నల్లబజారులో మూడు నాలుగు రెట్లు అధిక ధరకు కొనాల్సి రావడం బాధితుల ఇల్లూ ఒళ్లూ గుల్ల చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ ఔషధాల ఉత్పత్తికి 5 దేశీయ ఫార్మా కంపెనీలకు కొత్తగా అనుమతిచ్చింది.

ఇతర దేశాల నుంచి వీటి దిగుమతులు పెంచడంతోపాటు ఇక్కడి నుంచి విదేశాలకు ఎగుమతులపై ఆంక్షలు విధించింది. బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సలో ప్రధానంగా యాంఫొటెరిసిన్‌- బి, పొసాకానజోల్‌ ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారు. దేశంలో డజనుకు పైగా ఫార్మా కంపెనీలు ఈ ఔషధాల ముడిపదార్థాలు, ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు చాలాకాలంగా ఉత్పత్తి చేస్తున్నాయి.గిరాకీ లేకపోవడంతో అవన్నీ ఇంతకాలం నామమాత్రంగా తయారుచేశాయి. ఇప్పుడు పరిస్థితులు మారిపోవడంతో ఉత్పత్తి పెంచే యత్నాల్లో నిమగ్నమయ్యాయి. ఇవన్నీ కొలిక్కి వచ్చి, మందుల లభ్యత పెరగడానికి కొంత సమయం పడుతుందని, అప్పటి వరకు కొరత తప్పదని ఫార్మా వర్గాలు చెబుతున్నాయి.

కొత్తగా అనుమతులు

* యాంఫొటెరిసిన్‌- బి ఇంజక్షన్‌ను దేశీయంగా భారత్‌ సీరమ్స్‌ అండ్‌ వ్యాక్సిన్స్‌ లిమిటెడ్‌, బీడీఆర్‌ ఫార్మా, సన్‌ ఫార్మాస్యూటికల్‌ ఇండస్ట్రీస్‌, సిప్లా, లైఫ్‌ కేర్‌, మైలాన్‌ లేబొరేటరీస్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. కొత్తగా నాట్కో ఫార్మా, ఎమ్‌క్యూర్‌ ఫార్మా, గుఫిక్‌ బయో, అలెంబిక్‌ ఫార్మా, లైకా ఫార్మాస్యూటికల్స్‌కు ఈ ఇంజక్షన్ల ఉత్పత్తికి అనుమతి లభించింది. రెండు, మూడు వారాల్లో ఈ కంపెనీల మందులు మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. నాట్కో ఫార్మా దాదాపు లక్ష యాంఫొటెరిసిన్‌-బి ఇంజక్షన్లను తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేయనుందని సమాచారం.

* పొసాకానజోల్‌ 100 ఎంజీ ట్యాబ్లెట్‌, 300 ఎంజీ ఇంజక్షన్‌ రూపంలో లభిస్తోంది. ఈ మందు ఏపీఐ (యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రేడియంట్‌), ట్యాబ్లెట్‌, ఇంజక్షన్‌ను ఎంఎస్‌ఎన్‌ లేబొరేటరీస్‌, బజాజ్‌ హెల్త్‌కేర్‌.. తదితర దేశీయ కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి.

* హైదరాబాద్‌కు చెందిన సెలాన్‌ ల్యాబ్స్‌ ఇటీవల లిపిడ్‌ ఎమల్షన్‌ ఆధారిత యాంఫొటెరిసిన్‌-బి ఇంజక్షన్‌ను విపణిలోకి విడుదల చేసింది. ఇది ఒక్కోటి రూ.4వేల నుంచి లభిస్తోంది. రోజుకు 10 వేల ఇంజక్షన్లను అందించనుంది.

అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ 10 లక్షల యాంఫోటెరిసిన్‌- బి ఇంజక్షన్లను సరఫరా చేయనుంది. ఇప్పటికే 2 లక్షల ఇంజక్షన్లు మనదేశానికి చేరుకున్నాయి. తైవాన్‌కు చెందిన టీఎల్‌సీ ఫార్మా కంపెనీ ఉత్పత్తి చేస్తున్న యాంఫొటెరిసిన్‌- బి ఇంజక్షన్లను మనదేశంలో విక్రయించడానికి క్యాడిలా హెల్త్‌కేర్‌, స్ట్రైడ్స్‌ ఫార్మాసైన్స్‌ సన్నాహాలు చేస్తున్నాయి. ఈ చర్యలతో త్వరలో మందుల ధరలు కొంత దిగిరావచ్చని స్థానిక ఫార్మా కంపెనీ ప్రతినిధి ఒకరు అభిప్రాయపడ్డారు.

ఇవీ చూడండి:

Audio viral: జీజీహెచ్​లో డాక్టర్ కాముడు.. ఆడియో వైరల్‌!

ABOUT THE AUTHOR

...view details